అమెరికా గగనతలంలో మరో చైనా నిఘా బెలూన్‌..

ప్రకటించిన పెంటగాన్‌..బ్లింకెన్ చైనా పర్యటన రద్దు

another-chinese-surveillance-balloon-transiting-latin-america-says-pentagon

వాషింగ్టన్‌: అమెరికా గగన తలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ (Spy balloon) కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ గుర్తించింది. ఇది తమ పొరుగునే ఉన్న లాటిన్‌ అమెరికా గగనతలంలో ఎగురుతున్నదని వెల్లడించింది. దానిని చైనాకు సంబంధించిన నిఘా బెలుగా గుర్తించినట్లు పెంటగాన్‌ ప్రెస్‌ కార్యదర్శి బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్రిక్‌ రైడర్‌ తెలిపారు. అయితే అది కచ్చితంగా ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. అది అమెరికా దిశగా కదులుతున్నట్లు కనిపించడంలేదని చెప్పారు. మరికొన్ని రోజుల్లో తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింటెన్, అమెరికా ట్రెజరీ మంత్రి జానెట్ యెల్లెన్ బీజింగ్ పర్యటనను రద్దు ( ప్రస్తుతానికి వాయిదా) చేసుకున్నారు. అమెరికా గగనతలంలో స్పై బెలూన్ సంచరించడం అన్నది తమ దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పేర్కొంది. తన పర్యటనకు ముందు జరిగిన ఈ ఘటన బాధ్యతారహితమైనదిగా ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.

దీనిపై చైనా విచారం వ్యక్తం చేసింది. పౌర వాతావరణం, ఇతర శాస్త్రీయ అవసరాల కోసం ప్రయోగించగా, అది దారి తప్పి వచ్చినట్టు వివరణ ఇచ్చుకుంది. చైనా బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ చట్టాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆ దేశ విదేశాంగ వ్యవహారాల డైరెక్టర్ యాంగ్ ఈ బ్లింకెన్ కు స్పష్టం చేశారు.

కాగా, కొన్ని రోజుల నుంచి తమ దేశ గగన తలంపై చైనా ‘నిఘా బెలూన్‌’ ఎగురుతున్నదని అమెరికా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్‌ అభ్యర్థన మేరకు దీన్ని కూల్చేయాలని రక్షణ కార్యదర్శి ఆస్టిన్‌ అనుకున్నా, కింద ఉండే చాలా మంది ప్రజలకు దాని వల్ల ప్రమాదం కలుగుతుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారు. వాయువ్య అమెరికాలోని భూ గర్భంలో సున్నితమైన ఎయిర్‌బేస్‌లు, వ్యూహాత్మక అణు క్షిపణులు ఉన్న ప్రాంతంలో చైనా బెలూన్‌ ఎగురుతున్నదని అమెరికా అధికారులు తెలిపారు. ఇంటలిజెన్స్‌ సమాచార సేకరణలో ఈ బెలూన్‌కు తక్కువ సామర్థ్యం ఉన్నట్టు తెలుసుకున్నామని వెల్లడించారు.