నటి నగ్మాను మోసం చేసిన కేటుగాళ్లు

టెక్నలాజి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని సంతోష పడాలో..టెక్నలాజి పుణ్యమా అని సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు. బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని చెప్పి..ఓటీపీ నెం అడిగి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా కాజేస్తున్నారు. అంతే కాదు మనకు తెలియకుండా మన బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా ప్రతి రోజు పదుల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలనే కాదు సినీ ప్రముఖులను , రాజకీయ నేతలను , బిజినెస్ రంగాల వారిని సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా సినీ నటి , రాజకీయ నేత నగ్మా ను కూడా ఇలాగే మోసం చేసి డబ్బులు కాజేశారు.

ఆమె ఫోన్ కి ఒక స్పామ్ లింక్ టిప్ కూడిన మెసేజ్ పంపించి రూ. లక్ష వరకూ కాజేశారు. నగ్మా చెప్తున్న దాని ప్రకారం తన ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చిందని.. అది బ్యాంకు నంబర్ ని పోలిన ప్రైవేట్ నంబర్ నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. నగ్మా ఆ లింక్ పై క్లిక్ చేయగా తన ఖాతాలో ఉన్న రూ. 99,998 ఖాళీ అయ్యాయని ఆమె వెల్లడించింది. నగ్మాలానే మరో 80 మంది బాధితులు బ్యాంక్ ఫ్రాడ్ కి గురై లక్షలు మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే ప్రైవేట్ బ్యాంకుకి చెందిన కస్టమర్లుగా పోలీసులు గుర్తించారు. ఫోన్ కి వచ్చిన మెసేజ్ లో లింక్ క్లిక్ చేయగానే తనకొక వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని.. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. కేవైసీ అప్ డేట్ చేయాలని, గైడ్ చేస్తా అని చెప్పి మిస్ గైడ్ చేసినట్లు ఆమె తెలిపింది. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి మెసేజ్ లకు స్పందించవద్దని ముంబై సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ సంబంధిత మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయని, ఆన్ లైన్ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ లో మోసగాళ్లు బ్యాంక్ సిబ్బంది అని, ఆన్ లైన్ కామర్స్ వెబ్ సైట్ అధికారులమని చెప్పుకుంటూ.. కస్టమర్లను ఓటీపీ చెప్పమని, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెపుతున్నారు.