పట్టాలెక్కనున్న మరో 22 ఎక్స్ప్రెస్ రైళ్లు
ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి
train
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అన్లాక్ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఎస్సీఆర్ ఆధ్వర్యంలో మొత్తం 300 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉండగా, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 22 ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా పునరుద్ధరించాలని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా నిర్ణయించారు. వీటిని ఏప్రిల్ 1వ తేదీనుంచి మార్గాలవారీగా ప్రారంభించనున్నారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, ఔరంగాబాద్, రేణిగుంట నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. మిగిలినవి తొలి వారంలో అందుబాటులోకి వస్తాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న రైళ్లలో 8 డైలీ సర్వీసులు కాగా, వారానికి మూడు రోజులు నడిచేవి రెండు ఉన్నాయి. మిగిలిన 12 రైళ్లు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తాయి. ప్రయాణికులంతా కరోనా నిబంధనలు పాటించడానికి రిజర్వేషన్ విధానాన్ని అమలుచేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
రాకపోకలు సాగించే రైళ్లు..
విజయవాడ-సికింద్రాబాద్ (02799), సికింద్రాబాద్-విజయవాడ (02800), గుంటూరు-కాచిగూడ (07251), కాచిగూడ-గుంటూరు(07252), సికింద్రాబాద్-విశాఖపట్టణం (02739), విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02740), ఆదిలాబాద్-నాందేడ్ (07409), నాందేడ్-ఆదిలాబాద్(07410) రైళ్లు ప్రతి రోజూ నడవనుండగా, మిగతా రైళ్లలో వారానికి ఒకసారి, మూడుసార్లు నడిచేవి ఉన్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/