నాని ఎవరో నాకు తెలియదు అంటూ వైసీపీ మంత్రి అనిల్ కామెంట్స్

ఏపీలో సినిమా టికెట్స్ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. తాజాగా హీరో నాని టికెట్స్ ధరల ఫై చేసిన కామెంట్స్ కు చిత్రసీమలో కొంతమంది సపోర్ట్ ఇస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ , కొడాలి నాని , అంబటి రాంబాబు వంటి వారు ఇప్పటికే నాని చేసిన కామెంట్స్ కు కౌంటర్ వేయగా..తాజాగా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు.

నానితో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘సినిమాల్లో పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌ ఎంత? పవన్‌ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టిక్కెట్‌ ధరలతో నష్టమే ఉండదు. సినీ హీరోలు పారితోషికం తగ్గించుకుంటే.. టిక్కెట్ల ధరలు మరింత తగ్గుతాయి’ అని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌ సినిమాల‌కు అయిన ఖర్చు ఎంత అని అనిల్ కుమార్ యాద‌వ్ నిల‌దీశారు. వాటిలో పవన్ క‌ల్యాణ్ తీసుకున్న పారితోషికం ఎంత‌? అని ప్ర‌శ్నించారు. సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళుతోందని ఆయ‌న అన్నారు. ఆ నలుగురు తీసుకునే కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి ప్ర‌భుత్వం టిక్కెట్ల ధ‌ర‌లు పెంచుతూ అనుమ‌తులు ఇవ్వాలా? అని ఆయ‌న నిల‌దీశారు. ఇక హీరో నాని ఎవరో తెలియదని, త‌న‌కు మంత్రి కొడాలి నాని మాత్రమే తెలుస‌ని అనిల్ కుమార్ చెప్పడం కొసమెరుపు.