ఆవేశమే అనర్ధం

Angry
Angry

ఆవేశమే అనర్ధం

మహిమ బస్సులో ప్రయాణిస్తున్నది. కిటికీవద్ద కూర్చోని, తదేకంగా ఆలోచిస్తూనే ఉంది. ఎంత తనకుతాను సర్దిచెప్పుకుంటున్నా తనదే తప్పుగా అనిపిస్తున్నది. ఆవిధంగా ఆవేశపడి ఉండాల్సంది కాదేమో అనిపిస్తున్నది. నిన్న ఆఫీసులో కోపాన్ని ప్రదర్శించాను, ఇవాళ ఉదయం ఇంట్లో భర్త, పిల్లలపై అసహనాన్ని వ్యక్తం చేసి, వారి మనసును గాయపర్చాను అని తనకుతానే మదనపడసాగింది. పనుల ఒత్తిడి పెరుగుతున్నకొద్ది ఆవేశం పెరిగిపోతూనే ఉంది. తద్వారా ఆరోగ్యంపై ఆ ప్రభావాన్ని చూపుతున్నది.

మునుపు ఉన్న ఉత్సాహం లేదు, ఆనందం అసలే లేదు. దీనికంతా కారణం ఆవేశం, కోపాన్ని ప్రదర్శించడమే..కానీ ఈ లోపాన్ని గుర్తించి, దీన్ని జయించే ప్రయత్నాలు చాలామంది చేయరు. అందుకే వారి జీవితం ఆనందం లేని, భారబతుకుగా భావిస్తారు. మన భావాలను ఎదుటివాళ్లు అర్ధం చేసుకొనే విధంగాను, మన అభిమతాన్ని మన్నించి మసలుకొనే రీతిగాను మనం వాళ్లను ప్రభావితం చేయగలిగినప్పుడు మన ఎమోషన్స్‌ మనకు లాభదాయకంగా ఉపకరిస్తాయి. ఇటువంటి సామర్థ్యం సాధించేందుకు మనం మానవ కౌశలాలను పెంచుకోవాలి.

మెరుగు పరచుకోవాలి. అహంకారాన్నీ, ఆధిపత్య ధోరణినీ ప్రదర్శించి ఎదుటివాళ్లపైన ఎప్పుడూ పైచేయి సాధించేందుకు ఎమోషన్స్‌ను ఉపయోగించుకొంటే అవి బెడిసి కొడతాయి. దుష్పరిణామాలకు దారితీస్తాయి. మనలను దురవస్థలపాలు చేస్తాయి. రమణమూర్తి హోటల్లో టిఫెన్‌ తింటున్నప్పుడు సర్వర్‌ కొంత అజాగ్రత్తగా వ్యవహరించాడు. అతని చొక్కాపైన చుక్క కాఫీ ఒలుకబోశాడు. ఈ స్వల్పవిషయానికి అతిగా స్పందించి కోపంతో రెచ్చిపోయాడు రమణమూర్తి. సర్వర్‌ బా§్‌ుని స్పృహ తప్పేలా చితకబాదాడు. కంగుతిన్న హోటల్‌ సిబ్బంది రమణమూర్తిపైన తిరగబడ్డారు. దేహశుద్ధి చేసి గెంటి వేశారు. దీన్నే ‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటాం.

హోటల్‌ సర్వర్‌ తనకు శత్రువ్ఞ కాడనీ, ఉద్దేశ పూర్వకంగా కాఫీ ఒలుకబోసి ఉండడనీ, పొరబాటు మానవ సహజమనీ, హేతుబద్ధంగా ఆలోచించి రమణమూర్తి తన విజ్ఞతను వినియోగించుకొని ఉంటే విషయం ఇంతదూరం వచ్చేది కాదు. విధి నిర్వహణలో జాగ్రత్తగా మసలుకొమ్మని సర్వర్‌ బా§్‌ుని మందలించి ఉండవచ్చు. లేదా హోటల్‌ యజమానికి ఫిర్యాదుచేసి ఉండవచ్చు. మంచిమర్గాలు తన ముందు ఉండగా దౌర్జన్యాన్నీ, దాడినీ ఆయుధాలుగా స్వీకరించి బహిర్గతం చేస్తూ ఉంది. ఆవేశాలపైన అదుపులేని అతని డొల్లతనాన్ని వెల్లడి చేస్తూ ఉంది. అనేక సందర్భాలలో మనం ఎన్నో అసంతృప్తికర సన్నివేశాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయిష్టులైన మనుషులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది.

మన సహనాన్ని పరీక్షించే వాళ్లు ఉంటారు. మనల్ని రెచ్చగొట్టేవాళ్లు ఉంటారు. హృదయాలను గాయపరచి మనకు వేదనను, వ్యాకులతను మిగిల్చిపోయే వాళ్లు కూడా ఉంటారు. మన బలహీనతలను సొమ్ము చేసుకొని మన బ్రతుకులను భ్రష్టుపట్టించే వాళ్లూ ఉంటారు. ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా జీవించడం లేదు. సమాజంలో సవాలక్ష మందితో సహజీవనం సాగిస్తున్న మనం దైనందిన జీవితంలో ఇటువంటి పరీక్షలను వివేకవంతంగా ఎదుర్కోవడం నేర్చుకో వాలి. సహనంతో వ్యవహరించడం అలవరచుకోవాలి.

ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం అభ్యాసం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం విజయవంతంగా ఉంటుంది. ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రతి సందర్భంలోను రెచ్చిపోవడం వివేకవంతం కాదు. ఒక క్రీగంటి చూపుతో, పెదవి విరుపుతో, ఒక మౌనముద్రతో, ఒక మందలింపుతో అవతలి మనుషులకు మన అసంతృప్తినీ, అసమ్మతినీ అతి స్పష్టమైన రీతిలో వ్యక్తం చేయవచ్చు.

వాళ్లను రెచ్చగొట్టి, ఆవేశపరులుగా మార్చకుండా సానుకూల పద్ధతులలో సత్ఫలితాలను సాధించవచ్చు. సంస్కార వంతంగా ప్రర్తిస్తే సంఘర్షణలను నివారించుకోవచ్చు. మనం ఎదిగిన కొద్దీ, విద్యావివేకాలు పెరిగినకొద్దీ, సహనాన్ని, సర్దుబాటు స్వభావానీ, సంస్కారాన్నీ పెంచుకొంటూ రావాలి. ఆవేశాలను అదుపు చేసుకోవడం అభ్యాసం చేసుకోవాలి.

మన భావోద్వేగాలను ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపైన, ఎంత మేరకు, ఏరీతిగా వ్యక్తం చేయవచ్చు. ఏ పరిస్థితుల్లో మౌనం శ్రేయస్కరంగా ఉంటుందో గ్రహించే విజ్ఞతను సమకూర్చుకోవాలి. మన ప్రవర్తనలకు, మాటలకు ఫలితాలు ఎలా ఉంటాయి. అని ఆలోచించడం ఆనవాయితీగా మార్చుకోవాలి. ఇటువంటి ఉద్వేగ పరిపక్వతను సాధించినప్పుడు జీవితంలో సమస్యలు తగ్గుతాయి. బతుకుసుఖంగా సాగుతుంది. ఉద్వేగప్రజ్ఞ ఒక్కనాటితో అబ్బే విద్యకాదు. చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, నిరంతర కృషితో సాధించవలసిన విశిష్ట లక్షణం ఇది.