ఆంధ్రాబ్యాంక్‌.. పేరైనా మిగలలేదే!

వార్తల్లోని వ్యక్తి (ప్రతిసోమవారం)

Bogaraju Pattabi Sitaramaiah (File) , Founder Andhra Bank

ఏప్రిల్‌ 1వ తేదీతో ఆంధ్రా బ్యాంకు చరిత్రకు -నూరేళ్లు నిండాయి. తెలుగు వారి ఏకైక బ్యాంకుని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాతో విలీనం చేశారు.

బ్యాంకుని యూనియన్‌ బ్యాంకుతో విలీనం చేసినా, కనీసం ‘ఆంధ్ర పేరును వ్ఞంచాలని ఎందరో మేధావ్ఞలు, జర్నలిస్టులు, ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు ఎందరో విజ్ఞప్తి చేసినా, తెలుగింటి కోడలే ఆంధ్ర బ్యాంకు పేరు లేకుండా చేశారు!

సీతారామయ్య 96 సంవత్సరాల క్రితం బ్యాంకుని స్థాపిస్తే (నిర్మల) సీతారామన్‌ ‘ఆంధ్ర శబ్దానికి స్వస్తిపలికారు.

ఆంధ్రా బ్యాంకు స్థాపనే విచిత్రం

ఆంధ్రా బ్యాంకు స్థాపనే విచిత్రంగా జరిగింది. స్వాతంత్య్రసమర యోధుడు, భాషా రాష్ట్రాల ఉద్యమ సారధి, అఖిల భారత కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు, అన్నింటినిమించి మహాత్మాగాంధీ అనుంగు అంతేవాసి ‘బందరు డాక్టరు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రా బ్యాంకుని స్థాపించారు

బందరులో ఆయన ఇంటికి ఎదురుగావ్ఞన్న ఇద్దరు వైశ్యసోదరులు తమ సొమ్మును ఎక్కడ భద్రపరచాలని వివాదపడి, పట్టాభివద్దకు వచ్చి, సొమ్మును దాచిపెట్టవలసిందిగా అర్థించారు.

అంతేకాక, అప్పటిలో రైతులు తమ వ్యవసాయానికి కావలసిన సొమ్ము లభించక, అప్పులిచ్చే దాతలు కరువై, బాధపడుతున్నా రు.

కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.ఈ పరిస్థితిని చూసిన ఆ ఆంధ్ర మేధావి పట్టాభి ఆంధ్రులకు ఒక ప్రత్యేక బ్యాంకు అవసరమని భావించి, ఆంధ్రాబ్యాంకుని స్థాపించారు.

ఇంటి అరుగే బ్యాంకు ఆఫీసు

1923 నవంబర్‌ 20న బ్యాంకు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఆ నవంబర్‌ 28 నుంచి బ్యాంకు పని ప్రారంభమైనది. బందరులోనే మొదటి బ్రాంచి. డాక్టర్‌ పట్టాభిగారి ఇంటి అరుగే దాని ఆఫీసు! బ్యాంకు పెట్టుబడి ఎంత? ఒక లక్ష రూపాయలు! అదీ ఆంధ్రాబ్యాంకు ఆవిర్భావచరిత్ర!

కాని, ఆ బ్యాంకు అచిరకాలంలోనే దేశంలోనే కాక, దేశదేశాలకు విస్తరించింది. 2,900 శాఖలు! దేశంలో తొలి క్రెడిట్‌కార్డును విడుదల చేసిన ఘనత ఆంధ్రాబ్యాంకుదే.

దానికి ప్రపంచవ్యాప్తంగా 3,800 ఎటిఎమ్‌లు కూడా కలవ్ఞ(అంటే, ‘ఎనీటైమ్‌ మనీ అని అర్థం) కాగా, యూనియన్‌ బ్యాంకుతో విలీనం వల్ల రెండింటికీ కలిపి 9,500 శాఖలు, 12వేల ఎటిఎమ్‌లు వ్ఞంటాయి. బాగానే వ్ఞంది.

దాదాపు తెలుగు వారి నోటనానే ‘ఆంధ్ర నామం అంతర్థానం కావడమే తెలుగు వారికి బాధాకరం. కనీసం ‘ఆంధ్ర బ్యాంకు పేరైనా ఉమ్మడి ఆంధ్ర ప్రాంతంలో ఉంచితే బాగుండేది కాదా?

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/