బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం డ్రామా

బిసిలకు న్యాయం చేసింది తెదేపానే..
కేసు వేసిన ఇద్దరు మీ పార్టీ వాళ్లుకాదా?
రూ. 3,600 కోట్ల బిసిల నిధుల దారి మళ్లింపు: చంద్రబాబు ధ్వజం

మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు

గుంటూరు : ముఖ్యమంత్రి జగన్‌ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గాయని తేదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

33 ఏళ్లపాటు ఉన్న రిజిర్వేషన్ల ను కాపాడ లేకపోయారని బీసీలపై కక్షతోనే ఇలా చేశారని ఆయన ఆక్షేపిం చారు. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. క్షేత్ర స్థాయి నుండి సమర్థవంతమైన నేతలు రావాలనే ఉద్దేశంతో 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఆయన గుర్తు చేశారు.

రిజర్వేషన్ల పెంపుతో అనేక బీసీ కులాలు రాజకీయంగా పైకి ఎదిగాయని చెప్పారు. ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళితే బీసీలకు 24శాతం మాత్రమే వస్తాయన్నారు. అదే జరిగితే 1987లో ఇచ్చిన రిజర్వేషన్లకంటే మూడు శాతం తగ్గుతుంది. అమరావతిని నాశనం చేసేందుకు దానికి సంబందించిన కేసుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో న్యాయవాధి ముఖుల్‌రోహిత్గీని తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ ధనాన్ని ఆయన దోచిపెట్టారు. అదే బీసీ రిజర్వేషన్ల కేసువిషయంలో మాత్రం శీత కన్ను వేస్తున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

సీఎం జగన్‌తోపాటు న్యాయవాధుల వైఫల్యమిది. మండలి రద్దుకోసం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్‌ చేశారు. ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిశారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను కాపాడటంపై ఎందుకు శ్రద్ద పెట్టలేదు అని ప్రశ్నించారు.

బీసీలకు ప్రత్యేకంగా కేటాయించిన రూ. 3,600కోట్లను మళ్లించారు. ఆధరణ పథకం కింద పంపిణీ చేయాల్సిన పనిముట్లను గోదాముల్లో ఉంచారు. 7లక్షల మంది బీసీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి దరఖాస్తు చేస్తే ఫలితం లేకుండా పోయింది. బీసీలు ఎక్కువగా ఉండే శాసనమండలిని రద్దు చేస్తామంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసినా బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి వైకాపాకు చెందిన వారు కాదా? అని ప్రశ్నించారు. కావాలనే వారిద్దరి చేత కేసు వేయించి రిజర్వేష్లను అడ్డుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

అసత్యాలు చెప్పడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని చంద్రబాబు ఆరోపించారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతో వైకాపా కుట్రలు చేస్తోందని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/