పెండింగ్‌లో ఉత్తర విశాఖ ఫలితం

ganta srinivasa rao
ganta srinivasa rao

విశాఖ: విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈవిఎంలు మొరాయించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇక్కడ నుంచి టిడిపి గంటా శ్రీని వాసరావు పోటీ చేస్తున్నారు. గురువారం ఆయన రెండు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొన్ని ఈవిఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈవిఎంలను అధికారులు మరమ్మత్తులు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వాటిని పక్కన పెట్టి తర్వాత రౌండ్ల లెక్కింపును కొనసాగించారు. ఇలా సుమారు ఆరు ఈవిఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని తేలింది. మొత్తం రౌండ్లు పూర్తయ్యాక మొరాయించిన ఈవిఎంల స్థానంలో వివిప్యాట్లను లెక్కించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీవీప్యాట్లలో పోలైన ఓట్లను తప్పుగా చూపించడంతో అక్కడ ఉన్న వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇబ్బంది కలిగిన పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ నిర్ణయం తీసుకోనున్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/