యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ

AP CM Jagan

Amaravati: శిక్షణా కేంద్రాల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్షి నిర్వహించారు. రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.   నెలన్నర రోజుల్లోనే డిజైన్లు సహా ఆర్థిక వనరుల సమీకరణ చేసి ఏడాదిలోపు నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున, నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా నాలుగు కేంద్రాలు సహా పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు.

విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్షి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…  ప్రభుత్వంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలన్నీ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారానే చేయాలని సీఎం స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి శిక్షణ కార్యక్రమం, కోర్సులు, నాణ్యతను ఈ కమిటీ ద్వారా పరిశీలించాలన్నారు. ఉన్నత విద్యామండలి, ఐటీ విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమించాలన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం, ఇతర రాష్ట్రాల్లోని ఐటీ రంగ పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. ఐటీ రంగంలో రాష్ట్రానికున్న అవకాశాలు.. అనుసరించాల్సిన పాలసీపైనా సమావేశంలో చర్చించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/