రేపు మధ్యాహ్నం శ్రీవారి భక్తులకు అనుమతి ‘నో’

నాలుగున్నర గంటలు దర్శనం రద్దు

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: తిరుమలలో శనివారం ఒక్కరోజు నాలుగున్నర గంటలపాటు ఏడుకొండల వెంకన్న దర్శనం నిలిపివేస్తున్నారు. ఆలయంలోకి భక్తులనుకూడా అనుమతించరు. ఈ మేరకు టిటిడి ఈ నిర్ణయాన్ని నెల రోజులకు ముందుగానే ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై శ్రీవారి భక్తులకు టిటిడి విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తోంది. సాధారణంగా గ్రహణ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇలా మూసివేయడం జరుగుతుంది. అయితే ఆలయాన్ని మూసివేయకుండా తెరచివుంచి భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే తిరుమలలో ఎంతో పవిత్రంగా, అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరుగుతున్న ‘శ్రీవరాహస్వామి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాల్లో చివరిరోజు శనివారం కావడంతో 27 శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఏకధాటిగా నాలుగున్నర గంటలు శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించరు. శ్రీవారి దర్శనంకూడా కల్పించరు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి తమ దర్శనం సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో తిరుమల శ్రీవారి ఆలయంలో ఇదేరీతిలో శాస్త్రోక్తంగా ‘అష్టబంధ బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను టిటిడి ఆగమోక్తంగా, వైదికంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లోకూడా కొన్ని గంటలుపాటు భక్తులకు దర్శనం కల్పించలేదు, అలాగే శ్రీవరాహస్వామి ఆలయంలోనూ శనివారం ఉదయం 11.07 గంటల నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ వైదిక కార్యక్రమాలతో శ్రీవారి ఆలయంలోనూ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో మూవు రోజులు ఏకంగా విఐపి బ్రేక్‌ రద్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ ఆదేశాలను పటిష్టంగా అమలుచేస్తోంది. ఈ రోజుల్లో కేవలం ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే వారు స్వయంగా వస్తేనే దర్శనం పరిమితం చేశారు. విఐపిల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించరు. వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు అదనంగా దర్శనం కల్పించేందుకు ఇది కొంతవరకు దోహదపడుతుందని టిటిడి అధికారుల అంచనా. ఇప్పటికే తిరుమలకు వచ్చిన భక్తులకు సాధారణ రోజుల్లో 70 వేల నుంచి 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తుండగా.. వారాంతపు రోజుల్లో 85 వేల నుంచి 99 వేల మంది వరకు భక్తులకు మహాలఘులో శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఈ సంఖ్య లక్ష మందికి దాటినా దర్శనం చేయించగలమని టిటిడి అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం తిరుమలలో ప్రొటోకాల్‌ పరిమిత సంఖ్యలో ప్రముఖులకు దర్శనం కల్పించడంతో 11 వేల మంది సామాన్య భక్తులు అదనంగా దర్శనం చేసుకున్నారు. 93 వేల మంది భక్తులకు దర్శనం కల్పించింది. అంతేగాక సామాన్యభక్తులు కంపార్టుమెంట్లలో వేచివుండే సమయంకూడా సుమారు రెండు గంటలు తగ్గింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు తెరిచి 3 గంటలకు సుప్రభాతం నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు ఏకాంతసేవ వరకు ఏకధాటిగా ఆర్జితసేవలు మినహాయించి మిగిలిన సమయాల్లో సర్వదర్శనం భక్తుల క్యూ కదులుతూనే ఉంటుంది. గంటకు 4 వేల మంది నుంచి 4,500 మంది వరకు భక్తులను దర్శనం చేయించుకునేలా టిటిడి చూస్తోంది. ప్రతిరోజూ ఉదయం విఐపి బ్రేక్‌దర్శనాలు రెండు గంటలు సమయం సాగుతోంది. ప్రాధాన్యతవున్న లిస్టు 1, లిస్టు 2 తరువాత జనరల్‌ విఐపి బ్రేక్‌దర్శనాలను వారాంతంలో పూర్తిగా రద్దుచేయడంతో సామాన్యభక్తులకే శ్రీవారి దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.