దేశ ఆదాయంలో తిరుమల శ్రీవారే బెస్ట్‌

tirumala
tirumala


తిరుమల : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారు ఆదాయం విషయంలో తనకెవరూ పోటీ రాలేరని నిరూపిస్తున్నారు. భక్తులు సమర్పిస్తున్న నగదు, కానుకలతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతోంది. నగదు రూపంలో ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయు వస్తుండగా, నెలకు కనీసం 60 కేజీల నుంచి 80 కేజీల వరకు బంగారం  లభిస్తోంది. అలాగే, 400 నుంచి 500కేజీల వెండి వస్తోంది.  సగటున రోజుకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు, నెలకు రూ.80 నుంచి 90 కోట్ల వరకు  నగదు ఆదాయం హుండీ ద్వారా లభిస్తోంది. తాజాగా ఈ వేసవిలో నాలుగు సార్లు వెంకన్న హుండీ ఆదాయం సెంచరీ దాటేసింది. మార్చిలో రూ.105.89 కోట్లు, జూన్‌లో రూ.వంద కోట్లు, జూలైలో రూ.109.6 కోట్లు, ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ.113.71 కోట్లు లభించింది. ఈ అయిదు నెలల కాలంలో 524 కిలోల బంగారు కానుకలు హుండీ ద్వారా వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 180 కిలోలు ఎక్కువన్నమాట. వెండి కానుకలు కూడా గత ఏడాదికన్నా రెట్టింపు అంటే  3,098 కిలోలు వచ్చాయి. విరాళాలు మొదలు, గదుల అద్దెల వరకు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంది. భక్తులకు తిరుమలస్వామి మీద ఉన్న నమ్మకమే దీనికి కారణం.