చంద్రగిరి రీపోలింగ్‌లో ఉద్రిక్తత

chandragiri
chandragiri

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రీపోలింగ్‌ జరిగే గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రామచంద్రాపురం మండలం ఎన్‌.ఆర్‌.కమ్మపల్లిలోకి బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం చంద్రగిరి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆ చుట్లు పక్కల గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. తొలుత భారీగా అనుచరులతో వచ్చిన భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి..మాదిగపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తు ఆ గ్రామ వాసులు నిన్న సాయంత్రం అడ్డుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగిన తమ గ్రామంలో రీపోలింగ్‌ పెట్టించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి గ్రామంలోకి వచ్చేందుకు వీల్లేదంటూ గ్రామ పొలిమేర వద్దే అడ్డుకున్నారు. ఎలాగైనా గ్రామంలో ప్రచారం చేయాలని చెవిరెడ్డి పట్టుబట్టారు. గురువారం రాత్రి 10 గంటల వరకు ఇదే హైడ్రామా జరిగింది. తర్వాత ప్రచారం చేసేందుకు వీల్లేకపోవడంతో వెనుదిరిగాడు. మళ్లీ శుక్రవారం ఉదయం చెవిరెడ్డి ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి గ్రామంలోకి వచ్చి ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 19న రీపోలింగ్‌ ఉన్నందున గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/