ఏకాంతంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

వెల్లడించిన టీటీడీ ఈవో

srivari-brahmotsavam

తిరుమల: తిరుమలలో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల మేరకు, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి పరిపాలన భవనంలో కార్యాలయంలో కలెక్టర్‌ భరత్‌ గుప్తా, టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, డీఐజీ కాంతి రాణాటాటా, జేఈఓ బసంత్‌కుమార్‌, సీవీఎస్‌ఓ గోపినాథ్‌జెట్టి తదితరులతో సమీక్ష నిర్వహించారు. కాగా, ప‌రిమిత సంఖ్యలో భ‌క్తుల‌ను అనుమ‌తించి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌లను ఆల‌య మాడ వీధుల్లో నిర్వహించాలని ఈ నెల 1న టీటీడీ ప్రకటించింది.

ఈ మేర‌కు 200 మందికి మించ‌కుండా మాత్రమే మ‌త‌ప‌ర‌మైన‌, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా, అక్టోబ‌రు నుంచి డిసెంబ‌రు వ‌ర‌కు శీతాకాలంలో ప్రముఖ ఉత్సవాలు ఉన్న నేప‌థ్యంలో భ‌క్తులు గుమికూడే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నందున, క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని హెచ్చరించింది. ఈ మేరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహించాలనే నిర్ణయాన్ని టీటీడీ పునః సమీక్షించింది. ఈ మేరకు ఉత్సవాలను ఏకాంతంగా జరపాలని నిర్ణయం తీసుకుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/