నేటి నుండి తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala
Tirumala

తిరుమల: కలియుగ్గ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల తెప్పొత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు తెప్పొత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్దం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా పాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు.తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 17న రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తారు. ఇక మూడవరోజు మార్చి 18న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 19న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా ఈరోజు,రేపు వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండ: https://www.vaartha.com/andhra-pradesh/