ఏపి, తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు

వాతావరణశాఖ అంచనా

heavy-rain

హైదరాబాద్‌: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తూర్పు బీహార్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా ఏపిలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని… శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణం జిల్లాలలో భారీ వర్షాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కూడా పలు చోట్లు భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కడప, కర్నూలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు పడొచ్చని వెల్లడించింది.


ఇక తెలంగాణలోనూ మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ జిల్లాలో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/