అటు వారిటు – ఇటు వారటు.. ఫలితాలు ఎటు?

  • తూర్పు గోదావరి జిల్లాలో విచిత్ర పరిస్థితి
  • చివరి నిమిషంలో పార్టీలు మారిన వారి భవితవ్యం ఏమిటి?
  • గెలుపు లక్ష్యంతోనే అభ్యర్థులు – నిబద్ధత లేని రాజకీయ పార్టీలు
  • పెట్టుబడిదారులు ఆరంగేట్రంతో మారిన రాజకీయ పరిణామాలు
Political parties
Political parties

రాజమహేంద్రవరం: రాజకీయాలలో గెలుపే లక్ష్యం. రాజకీయపార్టీలు సైతం నిబద్దతకు నీళ్లొదొలేశాయి. గెలిచే అభ్యర్ధి అయితే చాలు. అతని రాజకీయ గతం ఏమిటి అనేది అవసరంలేదు. నిన్నటి వరకు శత్రువు నేడు మిత్రుడుగా మారిపోతున్నాడు.అప్పటి వరకు అతనిని బద్ద శత్రువుగా చూసిన ద్వితీయశ్రేణి నాయకులు ఒక్కసారిగా అతనిని పార్టీలోకి తీసుకుంటే అతనితో ఏవిధంగా ప్రయాణాన్ని సాగించాలి అనే మీమాంసలో నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ అధిష్టానానికి ఏమా త్రం పట్టనట్లు గా అభ్యర్దుల ఎంపికను పూర్తిచేసి ఎన్నికల బరిలో దించేశ ారు. ఈ విధంగా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు. పెట్టుబడిదారులే లక్ష్యం గా పార్టీ అధిష్టానాలు నడుచుకుంటున్నాయి. జిల్లాలో ఎన్నికల ముందు వరకు ఒక పార్టీలో ఉన్న వారు మరోపార్టీలోకి, ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలోవారు అధికారపక్షంలోకి రాత్రికి రాత్రే మారిపోయారు. అటు వారిటు – ఇటు వారటు మారిపోవడంతో ఒక్క సారిగా చాలా నియోజకవర్గాలలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. జయాపజాయలపై ఉన్న అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఈ పరిస్థితులలో ఫలితాలు ఎటు వైపు ఉంటాయా అని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ – వైకాపా లు బలమైన అభ్యర్దులను ఎన్నికల బరిలో నిలపాలని యోచించి చివరి నిమిషం వరకు అభ్యర్ధులను ప్రకటించకుండా తాత్సారంచేశాయి. ఎవరు ముందుగా అభ్యర్ధు లను ప్రకటిస్తే వారికి ధీటైన అభ్యర్ధిని బరిలో దించేందుకు ఒకరికొకరు ఎదురు చూశారు. చిట్ట చివరకు జిల్లాలో రెండు ప్రధానపార్టీలు చాలా చోట్ల అభ్యర్ధులను మారుస్తారన ప్రచారం సాగింది. అయితే కొన్నిచోట్ల అభ్యర్ధులను అధిష్టానం మార్చడం మాటటుంచితే అభ్యర్దులే పార్టీలను మార్చేశారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్ధిగా బరిలో నిలిచి విజయం సాధించిన తోట నరసింహం ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో ఈసారి తన భార్య తోట వాణికి జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని సిఎం చంద్రబాబునాయుడు ని కోరారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె అయిన తోట వాణి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తమకు అవకాశం కల్పించాలని, తమకు జిల్లాలో ఉన్న రాజకీయ పలుకుబడిని గుర్తించి తమకు టికెట్‌ ఇవ్వాలని తోట నరసింహం పట్టుబట్టారు. ఈ విషయంలో సిఎం చంద్రబాబు అక్కడి సిటింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైపే నిలబడిపోయారు. జ్యోతుల నెహ్రూ గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచినప్పటికీ కొంతకాలానికి తెలుగుదేశం పార్టీలో చేరడమే కాకుండా తన కుమారుడు జ్యోతుల నవీన్‌ కి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఇప్పించడంలో కృతకృత్యులయ్యారు. ఈ విధంగా టిడిపిలోకూడా జ్యోతుల పట్టు సాధించారు.తన డిమాండ్‌ నెరవేర్చకపోగా, అప్పటికే గత ఎన్నికల్లో తోట నరసింహం పై వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌ ను పార్టీలోకి చేర్చుకోవడం అతనికి కాకినాడ ఎంపి టికెట్‌ ను సిఎం ప్రకటించడంతో అలక బూనిన తోట నరసింహం తన భార్యతో సహా వైకా పాలో చేరిపోయారు.తోట వాణిని ఉప ముఖ్యమంత్రి,రాష్ట్ర హోమశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని వైకాపా అధినేత జగన్‌ కోరడంతో అక్కడ నుంచి బరిలోకి దిగారు. అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్ధిగా టికెట్‌ ఆశించి విశేషంగా ప్రచారం సాగించిన దౌలూరి దొరబాబు(ఎన్‌ఆర్‌ఐ) కి వైకాపా మొండిచేయి చూపింది. దీనితో ఆయన అండర్‌ గ్రౌండ్‌ కి వెళ్లిపోయారు.సుదీర్ఘ కాలంగా టిడిపిలో ఉంటూ ఆపార్టీ నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌,రాజ్యసభ సబ్యురాలుగా పనిచేసిన వంగా గీత కాకినాడ పార్లమెంటు పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించాలని కోరారు. అయితే టిడిపిలో అవకాశం లేకపోవడంతో చివరి నిమిషంలో ఆమె వైకాపాలో చేరిపోవడంతో చలమలశెట్టి సునీల్‌ అకస్మాత్తుగా పార్టీ మారిపోవడం, వైకాపా అభ్యర్ధి వెదుకులాటలో పడటం ఈ పరిస్థితుల్లో వంగా గీత పార్టీలోకి రావడం ఆమెకు కాకినాడ వైకాపా టికెట్‌ ను ఆఫర్‌ చేశారు. దీనితో అనూహ్యంగా ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన ఆమెకు ఎంపి టికెెట్‌ లభించింది. ప్రత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే గత ఎన్నికలలో వైకాపా నుంచి గెలిచిన సిటింగ్‌ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జ్యోతుల నెహ్రూతో బాటే టిడిపిలో చేరిపోయారు.అయితే చివరి వరకు ఆయన టిడిపి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు.అయితే ఆయన ముఖ్య అనుచరుడు వరుపుల రాజా కి అధిష్టానం టికెట్‌ కేటాయించడంతో ఆయన మనస్తాపం చెంది తిరిగి వైకాపా లోకి చేరి, వైకాపా అభ్యర్ధి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ విజయానికై విశేషంగా కృషి చేశారు. అమలాపురం రిజర్వుడు పార్లమెంటు నియజకవర్గంలో అక్కడి సిట్టింగ్‌ ఎంపి పండుల రవీంద్ర ఎన్నికలకు ముందే టిడిపి కి రాజీనామా చేసి వైకాపాలో చేరిపోయారు. అయితే ఆయన ఆపార్టీ నుంచి రాజోలు ఎమ్మెల్యే స్థానం ఆశించినప్పటికీ ఆ స్థానాన్ని ఎప్పటి నుంచో ఆశిస్తున్న బొంతు రాజేశ్వరరావుకి అధిష్టానం కేటాయించడంతో ఎంపి రవీంద్ర సైలెంట్‌గా ఉండిపోయారు. అదే పార్లమెంటు పరిధిలోని పి.గన్నవరం సిటింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి టిడిపి అధిష్టానం టికెట్‌ కేటాయించకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరేందుకు జగన్‌ ని కలిసి ఆయననుంచి స్పష్టమైన హామీలేకపోవడంతో తిరిగి టిడిపి చెంతకే చేరారు. జిల్లాలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట ఇచ్చిన టిడిపి అధిష్టానం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి, పి.గన్నవరం ఎమ్మెల్యే నారాయణమూర్తి లకే మొండిచేయి చూపింది. అదే విధంగా ఇరు పార్టీలలో టికెట్‌ ఆశించి భంగపడిన వారంతా ఆయా పార్టీల అభ్యర్ధుల విజయానికి చిత్తశుద్ది తో కృషి చేశారా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ పరిస్థితుల్లో అటు వారిటు – ఇటువారటు మారడం తో ఆయా ప్రాంతాలలోని అభ్యర్ధుల విజయావకాశాలు,ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంతా భావిస్తున్నారు.