గుంటూరులో ఐజీ , ఎస్పీల పర్యటన

IG Vineet Brijlal
IG Vineet Brijlal

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపి నేతలు తమను గ్రామాల్లో బతకనివ్వడం లేదని టీడీపీ శ్రేణులు ఓవైపు ఆరోపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ, వాళ్లే వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులపై దాడులకు దిగుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైఎస్‌ఆర్‌సిపి బాధితుల శిబిరాలను ఏర్పాటు చేయడం, పోటీగా టీడీపీ బాధితుల శిబిరాలను తామూ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ఆర్‌సిపి నేతలు ప్రకటించడంతో పరిస్థితి వేడెక్కుతోంది. ఈ క్రమంలో దక్షిణ కోస్తా ఐజీ వినీత్ బ్రిజ్లాల్, గుంటూరు ఎస్పీ జయలక్ష్మి ఈరోజు పల్నాడులో పర్యటించారు.

పల్నాడులో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయం నుంచి ఫ్యాక్షనిజాన్ని అణచివేసి శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా ప్రచారం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని పార్టీలు, అన్ని వర్గాలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడానికే పోలీసులు ఉన్నారనీ, కాబట్టి అనవసరమైన వదంతులను వ్యాప్తి చేయొద్దని అన్నివర్గాలను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చెప్పారు. తాము చట్టం ప్రకారం ముందుకు పోతామనీ, మనుషులను, పార్టీలను పరిగణనలోకి తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. 2014 తర్వాత ఈ ప్రాంతంలో 4 హత్యలు జరిగాయని, మరో 324 గొడవలు జరిగాయని తెలిపారు. వీటిలో 90 శాతం కేసులు విచారణ పూర్తయి, చార్జిషీట్ కూడా దాఖలు చేశామని వెల్లడించారు. కాబట్టి గతంలో ఎన్నికల ముందుతో పోల్చుకుంటే ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. గ్రామాల నుంచి వెళ్లిపోవాలని టీడీపీ మద్దతుదారులకు పోలీసులే చెబుతున్నారన్న వార్తలను ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఖండించారు. ఇలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే తమ దృష్టికి తీసుకురావాలనీ, ఒకవేళ అది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/