తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

Rains in telugu states
Rains in telugu states

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆదివారం వర్షాలు పడ్డాయి. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. రాష్ట్రంలో ఆగేయ, తూర్పుదిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండటంతో కోస్తా తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో రెండు మూడు రోజుల పాటు చలిగాలులు ప్రభావం కనిపిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. హైదరాబాద్‌లో శీతలగాలులు ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆదివారం హైదరాబాద్‌లో పలు చోట్ల శీతలగాలులతోపాటు చిరు జల్లులు కురిశాయి. ఆదివారం నగరంలో సాధారణం కంటే 8.2 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల సెల్సియస్‌ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 27 మి.మీ, ఉప్పల్‌లో 26, అల్వాల్‌లో 19.8, సికింద్రాబాద్‌లో 16 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/