ఈవీఎంల తీరుపై నేతల అసంతృప్తి

chandrababu, kavitha,Raghuveera, jd
chandrababu, kavitha,Raghuveera, jd

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో తొలి దశ పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. ఈవీఎంల మొరాయింపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అటు సామాన్యులు, ఇటు నేతలు ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిఎం చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నిజామాబాద్‌ ఎంపి కవిత, జనసేన ఎంపి అభ్యర్థి లక్ష్మీనారాయణ తదితరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. సాక్షాత్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన కూడా వీవీప్యాట్‌ మొరాయించాయి.

చంద్రబాబు

సిఎం చంద్రబాబు చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక పోవటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈవీఎంలు దుర్వినియోగమవుతాయని ఎప్పటి నుంచో చెప్తున్నామని, బ్యాలెట్‌తో ఏ సమస్యా ఉండదని చెప్పినా వినలేదని ఆక్షేపించారు. ఈవీఎంల వల్ల నష్టాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఈవీఎంలపై రివిజన్ పిటిషన్ వేసే విషయంపై ఆలోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.


ఎంపి కవిత

ఎంపి కవిత పొలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కవిత స్వగ్రామం పోతంగల్‌లో సాంకేతిక సమస్యతో ఈవీఎంల మొరాయించడంతో పోలింగ్‌ 40 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలోనే నిల్చున్నారు. పోలింగ్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తంచేశారు.


ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

ఎన్నికల సంఘం అధికారులు ప్రచారాల్లో ఆర్భాటాలు చేశారే తప్పా.. పోలింగ్ రోజున ఆచరణ సక్రమంగా లేదని రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్న పాఠశాలల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి రఘువీరారెడ్డి ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. ఈవీఎం మొరాయించడంతో అరగంట సేపు బయటే వేచి ఉండాల్సి వచ్చింది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఈవీఎంల పనిచేయకపోవడంపై జనసేన ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖలోని ఏయూ పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 227లో ఉదయం 8.20 గంటలైనా పోలింగ్‌ ప్రారంభం కాలేదన్నారు. ఉదయం 6.45 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారని, సరైన సమాధానం ఎవరూ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/