టిడిపి ఓడినా..ఎర్రన్నాయుడు కుటుంబం గెలిచింది

acchenaidu, rammohan naidu, bhavani
acchenaidu, rammohan naidu, bhavani


అమరావతి: ఏపి ఎన్నికల ఫలితాల్లో టిడిపి 23 స్థానాలకే పరిమితమై ఘోరపరాజయం పొందింది. రాష్ట్రంలో టిడిపి ఓటమి పాలైనా..కింజరాపు కుటుంబం నుంచి పోటీ చేసిన ముగ్గురూ విజయం సాధించారు. దివంగత నేత ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌ నాయుడు, కుమార్తె భవాని ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు రెండోసారి గెలుపొందారు. సమీప వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి పేరాడ తిలక్‌పై 8,857 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. సమీప వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ది దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌ గెలుపొందారు. ఓ దశలో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడింది. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత టిడిపి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడే విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్దిగా పోటీ చేసిన ఎర్రన్నాయుడి కుమార్తె, సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావు కోడలు భవాని భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశ్‌రావుపై 30,065 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడం విశేషం.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/