అమరావతిపై జగన్‌ స్పష్టతను ఇవ్వాలి

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేసిందని… అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న తాను కూడా అమరావతికి మద్దతు పలికానని ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని అన్నారు. అయితే, మడమ తిప్పం, వెనక్కి వెళ్లం అని చెప్పిన వైసీపీ అధినేత… వారి మాటలకు పూర్తి విరుద్ధంగా వెళుతున్నారని విమర్శించారు. గత నాలుగు నెలలను పరిశీలిస్తే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ తీరు ఒకడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కన్నాతో పాటు పలువురు బిజెపి నేతలు నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నా మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అన్ని విషయాల్లో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటోందని కన్నా దుయ్యబట్టారు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ, పని తక్కువ అనే విషయం స్పష్టంగా కనపడుతోందని అన్నారు. అధికారంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి… ప్రతిపక్షంలో ఉన్నామనే భావనతో నే మాట్లాడుతున్నారని చెప్పారు. అన్ని పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని… అయితే, అవినీతి ఎక్కడ జరిగిందో, ఎవరు చేశారో అనే విషయాన్ని మాత్రం వెల్లడించరని అన్నారు. అవినీతి జరిగితే దాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వివరాలను బయటకు చెప్పకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/