పోలవరంపై సుప్రీంకోర్టులో ఒడిశా అఫిడవిట్‌

ఏపివీ తప్పుడు అంచనాలు.. పోలవరం పనులు నిలిపివేయాలి

Polavaram Project
Polavaram Project

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఒడిశా ప్రుభుత్వం కోర్టుకు వివరించింది. పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని, ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద ప్రవాహం ఏపి చెప్పినదాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఒడిశా వాదించింది.ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేస్తూ 2018, జులై 10, ఆ తర్వాత 2019, జూన్ 27 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులపై రద్దు చేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

రూర్కీ ఐఐటీ సర్వే ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని ఒడిశా సర్కారు వాదనలు వినిపించింది. అదే జరిగితే ఒడిశా పరిధిలోని శబరి, సీలేరు ప్రాంతాల్లో 200 అడుగులకుపైగా ముంపు తలెత్తుతుందని, అంత వరద ప్రవాహాన్ని పోలవరం డ్యాం తట్టుకోలేదని స్పష్టం చేసింది. అంతేగాక పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 2005లో 412గా పేర్కొనగా.. 2017, మే నాటికి ముంపు గ్రామాల సంఖ్య 371కి తగ్గిందని.. ముంపు గ్రామాలపై స్పష్టత లేదని ఒడిశా ఆరోపించింది. తమకు జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. పూడిక వల్ల భవిష్యత్తులో బ్యాక్ వాటర్‌తో నష్టం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గరిష్ట వరదను లెక్కించడానికి బ్యాక్ వాటర్ స్టడీ చేయించాలని కోరింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/