ఆరోగ్యశ్రీ పై కీలక నిర్ణయాలు తీసుకున్న సిఎం జగన్‌

వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఆరోగ్యశ్రీ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎపి సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతి లో క్యాన్సర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆసుపత్రులను, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని జగన్‌ అధికారులకు సూచించారు. 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండేలా చూడాలని కనీసం ఆరు సంవత్సరాలకు ఒకసారయినా వాహనాలను మార్చాలని చెప్పారు. వేయి వాహనాలను ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నామని జగన్‌ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డు, క్యూ ఆర్‌ కోడ్‌ తో కార్డులను జారీ చేయాలని, ఆ కార్డులో ఎప్పటికప్పుడు కుటుంబ ఆరోగ్య వివరాలను పొందుపరచాలని డిసెంబర్‌ 21 నుండి హెల్త్‌ కార్డులను జారీ చేయాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

అయిదు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వర్తించాలని, వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆ ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని వివరించారు.హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో 150 ఆసుపత్రులలో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేయాలనీ, నవంబర్‌ మొదటి వారం నుండి ఇది అమల్లోకి తేవాలని.. జాబితాలో చేరే వ్యాధుల వివరాలతో లిస్ట్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని, ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నామని జగన్‌ తెలిపారు. ఆరోగ్యశ్రీ లో ఉన్న ఆసుపత్రులను ఏ, బీ, సి జాబితాలుగా చేసి సి కేటగిరీలోని ఆసుపత్రులను తొలగించి, లోపలున్న ఆసుపత్రులను బీ కేటగిరీలోకి తెచ్చి పరిశీలించాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/