తాము ఇలా వ్యవహరించి ఉంటే మీ పరిస్థితేంటి

Chandrababu
Chandrababu

కడప: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి నేతలు, కార్యకర్తలపై ఈ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఆరోపించారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని, కొన్నిచోట్ల అదీ లేదని తెలిపారు. అదే, వైసీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే టిడిపి క్యాడర్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసులతో టీడీపీని అణచివేయాలనుకంటే అది సాధ్యం కాదని హెచ్చరించారు.

సీఎం జగన్ కు ఇప్పటికే అనేక దెబ్బలు తగిలాయి కానీ ఇంకా గుణపాఠం నేర్చుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఇందీరాగాంధీ హయాం నుంచి ఎంతో మంది రాజకీయనాయకుల్ని చూశామని, కానీ ఇంత దుర్మార్గపు పాలన చూడలేదని అన్నారు. ఇప్పుడో కొత్త పంథా ఎంచుకున్నారని, ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన మామూలు వ్యక్తులకు రాదని, ఆర్థికమూలాలు దెబ్బతీసి వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పని తాము చేసుంటే మీలో ఒక్కరైనా వ్యాపారాలు చేసుకునేవారా? అని చంద్రబాబు తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/