శ్రీకాకుళం నుండి ఎన్నికల ప్రచారం

 Naidu Starts Election Campaign from Today
TDP President Naidu Starts Election Campaign from TodayAmaravati: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 27 రోజుల గడువుంది. కానీ ప్రచారం జరిపేందుకు ఉన్న సమయం 25 రోజులే. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆయన వెంట భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ కూడా ఉంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలోని తారకరామ మైదానంలో చిత్తూరు జిల్లా బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రల సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. భారీ బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. సాయంత్రం శ్రీకాకుళం చేరుకొని కోడి రామమూర్తి స్టేడియంలో ఆ జిల్లా బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రల సమావేశంలో పాల్గొంటారు. అక్కడి బహిరంగ సభ నుంచీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.

ఆదివారం నుంచి చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తారు. 17న విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. ఇవన్నీ బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రలు, అభిమానులు, కార్యకర్తలతోనే జరుగుతాయి. విజయనగరం జిల్లాలో మహారాజా కాలేజీ మైదానంలో, విశాఖపట్నం శారదా బేకరీ మైదానం, కాకినాడలో జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్‌ మైదానం, పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సభల్లో పాల్గొంటారు.

18న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 19న రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.జిల్లాల్లో సభలు ముగిశాక చంద్రబాబు బస్సుయాత్ర చేపడతారు. దీనికి టీడీపీ రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తోంది. ఈ రెండో విడతలో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు తదితర రూపాల్లో ప్రచారం చేయనున్నారు. మిషన్‌ 150ప్లస్‌ నియోజక వర్గాలనే టార్గెట్‌‌గా పెట్టుకున్న చంద్రబాబు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచార సభలకు వెళ్లనున్నారు.