సీబీఐ కోర్టుకు హాజరైన బొత్ససత్యనారాయణ

Botsa Satyanarayana
Botsa Satyanarayana

నాంపల్లి: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ కోర్టు ముందుకు హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులు నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2005లో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 59 మంది సాక్షులను విచారించింది. మొత్తం 12 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తన నివేదికలో పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/