జనసేన-బిజెపి లాంగ్‌ మార్చ్‌ వాయిదా

ప్రకటించిన బిజెపి రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి

pawan kalyan and Kanna Lakshminarayana
pawan kalyan and Kanna Lakshminarayana

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి తరలింపును వ్యతిరేకిస్తూ జనసేన-బిజెపి పార్టీలు సంయుక్తంగా చేపట్టనున్న లాంగ్‌ మార్చ్‌ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఫిబ్రవరి 2న ఆ రెండు పార్టీలు లాంగ్ మార్చ్ చేపట్టాయి. అయితే ఆ లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బిజెపి రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ప్రకటించారు. ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ప్రస్తుతం దీన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి. ఇటీవల బిజెపి, జనసేన నేతలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం రాష్ట్రంలో రెండు పార్టీలు కలసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఆ భేటీలోనే ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు అది వాయిదాపడినట్టు బిజెపి ప్రకటించింది. జనసేన నుంచి అధికారికంగా ఈ ప్రకటన వెలువడలేదు. అయితే, లాంగ్ మార్చ్ వాయిదా పడడానికి కారణం ఏంటి? మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే ఆసక్తి నెలకొంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/