ఏపి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

అమరావతి: రాష్ట్ర విభజన తరువాత ఏపికి తొలిసారిగా గవర్నర్‌ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఇఎస్‌ఎల్. నరసింహన్ కొనసాగారు. ఆయనను ప్రస్తుతం తెలంగాణకు పరిమితం చేశారు. ఎపికి హరిచందన్‌ను నియమించారు. గతంలో జనసంఘ్, జనతాపార్టీల్లో బిశ్వభూషణ్ హరిచందన్ పని చేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బిజెపి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1988లో జనతా పార్టీలో చేరిన ఆయన 1996లో తిరిగి బిజెపిలో చేరారు. సుదీర్ఘకాలం ఒడిశాలో ప్రజాప్రతినిధిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఒడిశాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశారు. బిజెపి, బిజెడిల సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. హరిచందన్ కు సాహిత్యం అంటే ఇష్టం. ఒడియా భాషలో ఆయన పలు రచనలు చేశారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/