ముగిసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

కెసిఆర్‌, జగన్‌ ఇద్దరూ అంగీకరించారు..కేంద్ర మంత్రి

apex-council-meeting-held-in-delhi

హైదరాబాద్‌: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఏపి సిఎం జగన్ పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీ 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపి బలమైన వాదనలు వినిపించాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఏపి స్పష్టం చేసింది. తాము వాడుకుంటున్నది మిగులుజలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపి తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాలపైనే తమ వాదనలు వినిపించాయి. ఈ సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలను చర్చించాలని అజెండా రూపొందించినప్పటికీ, ఆ నాలుగు అంశాల అనుబంధ అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు అప్పగించాలని తెలంగాణ కోరగా, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఏపి సూచించింది. తెలంగాణ సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సిఎం జగన్ జన్ పథ్1 అధికారిక నివాసం నుంచి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.


కాగా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలు, ప్రాజెక్టుల నిర్వహణ, గోదావరి జలాలను సమర్థంగా వాడుకోవడం, కృష్ణా బోర్డు తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించామని షెకావత్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించేందుకు ఇద్దరు సిఎంలు అంగీకరించారని ఆయన తెలిపారు. డీపీఆర్‌లు పరిశీలించి అపెక్స్‌ కౌన్సిల్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంలో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు కెసిఆర్ అంగీకరించారని షెకావత్ మీడియా ముఖంగా తెలిపారు. నదీ జలాల వాటాలకు సంబంధించిన నిర్ణయం సంబంధిత నదీ బోర్డులే తీసుకుంటాయని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/