కేంద్ర జలశక్తి మంత్రితో ఏపి మంత్రి అనిల్ భేటీ

పెండింగ్ నిధులు, ఎత్తిపోతల పథకాలపై చర్చ

ap-minister-anil-kumar-meets-union-minister-gajendra-shekhawat

అమరావతి: ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఈరోజు కలిశారు. ఈ సమావేశం అనంతరం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరామని తెలిపారు. త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని కేంద్రమంత్రిని ఆహ్వానించామని చెప్పారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులతో రాయలసీమకు కలిగే ప్రయోజనాలను వివరించామని అన్నారు.

నీటి వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీ ఖరారు చేసి త్వరలోనే చెబుతామన్నారని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎప్పుడు నిర్వహించినా పాల్గొనేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2021 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకెళుతున్నారని అనిల్ పేర్కొన్నారు. మంత్రి అనిల్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సహకారంపై కేంద్రమంత్రితో వారు చర్చించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/