కాపు మహిళలకు ఏపి ప్రభుత్వం శుభవార్త

కాపు నేస్తం అమలుకు ఉత్తర్వులు.. ఏటా రూ.15వేలు

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

అమరావతి: కాపు మహిళలకు ఏపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలకు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మేరకు మంగళవారం రాత్రి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ పథకం కోసం ఎంపికైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది.

ఇందుకోసం అబ్ధిదారులు వార్షిక ఆదాయం గ్రామాల్లో అయితే రూ.10 వేలు, పట్టణాల్లో అయితే రూ.12 లోపు కలిగి ఉండేవారు అర్హులు. అలాగే మూడెకరాలు దాటి పల్లం, పదెకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. నగరాల్లో 750 చదరపు అడుగులకు మించి ఇల్లుండకూడదు. కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ (పారిశుధ్య కార్మికులకు మినహాయింపు), ఆదాయ పన్ను చెల్లించే వారు ఉండకూడదు. దరఖాస్తు దారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి వారి ఆధార్, కుల, జనన ధ్రువీకరణ, బ్యాంకు ఆదాయ పత్రాలను, ఆస్తుల వివరాలను పరిశీలించి అర్హతను గుర్తిస్తారు. అన్ని అర్హతలు ఉన్న వారిని పథకం కోసం ఎంపిక చేసి వారి బ్యాంకు వివరాలు తీసుకుంటారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం తాజాగా వాటిపై గ్రామవలంటీర్ల ద్వారా విచారణ జరిపి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపడుతుంది. 


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/