అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌లతో ఏపి ప్రభుత్వం ఒప్పందం

చేనేత రంగానికి చేయూత

cm jagan-flipkart-amazon
cm jagan-flipkart-amazon

అమరావతి: ఏపిలో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనూ చేనేత వస్త్రాల అమ్మకాలు సాగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఈకామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. నవంబరు 1 నుంచి ఆన్ లైన్ పోర్టళ్లలో చేనేత వస్త్రాలు అమ్మకాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి వాటిని ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. ఈ మేరకు ఆప్కో కార్యాచరణ రూపొందిస్తోంది.
తొలి విడతగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఆన్‌లైన్‌లో వస్త్రాల అమ్మకాలు సాగించనున్నారు. ఇందులో భాగంగా రూ. 500 నుంచి రూ. 20 వేల వరకు ధర ఉన్న వాటిని అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్రంలో ప్రాచూర్యం కలిగిన ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పెడన, పొందూరు, వెంకటగిరి, మాధవరం తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత ఉత్పత్తులను విక్రయాలకు ఉంచనున్నారు. బయటి మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు వీటిని అందించేలా చర్యలు తీసుకున్నారు. చేనేత వస్త్రాల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా వాటిపై ప్రభుత్వ గుర్తింపు లోగోను ముద్రించనున్నారు. 


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/