హింసను విడనాడండి

AP DGP TAKOR
AP DGP TAKOR

హింసను విడనాడండి

విశాఖపట్నం, : హింసను విడనాడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర డీజీపీ ఆర్‌పి ఠాగూర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలో కమిషనరేట్‌ అధికారులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మావోయిస్టులు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పాల్గొవాలని హితవు పలికారు. కాదూ కూడదని మావోయిస్టుల్లో మార్పు రాకపోతే వారి చర్యలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్లో ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు మావోయిస్టులే ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు అనైతికమన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రజాప్రతినిధులకు మరింత అదనపు భద్రత కల్పించామని పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్దఎత్తున గంజాయి సాగు జరుగుతుందని అటువంటి అసాంఘికచర్యలకు గిరిజనులు సహకరించవద్దని హితవుపలికారు. గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారంటూ వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. గిరిజన ప్రాంతాల్లో వారి కోసం పోలీసులు ఎంతో చేస్తున్నారని పేర్కొన్నారు.

గంజాయి సాగుతో పాటు రవాణా కూడా చట్ట వ్యతిరేకమన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని గిరిజన ప్రజలకు పోలీసులు మరింత చేరువవ్వాలని ఆయన సిబ్బంది, అధికారులకు పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అమర వీరుల వారోత్సవాల సందర్భంగా ఠాగూర్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో వారి ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్‌ అమరవీరుల సేవలు చిరస్మరణీయన్నారు. అమర వీరుల చిత్రపటానికి పూల మాల వేసి ఆయన ఘన నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా, డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.