సిఎం, సిఎస్‌ల మధ్య వార్‌!

రాష్ట్రంలో తాజా చర్చ ఎల్వీ వెనుక ఉన్నదెవరు?

AP CM Chandra babu, CS LV Subrahmanyam
AP CM Chandra babu, CS LV Subrahmanyam

అమరావతి: రాష్ట్రంలో కొత్త వార్‌ ఎన్నికల అనంతరం ప్రారంభమైందని చెప్పవచ్చు. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ ప్రకటించిన వెంటనే అధికార యంత్రాంగం, అపద్ధర్మ పాలకవర్గం రెండుగా చీలిపోయింది. వీరి మధ్య అంతరం నానాటికి ముదురుతోంది. నిత్యం మంత్రులు సీఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారింది. చివరికి ఐఏఎస్‌ల సంఘం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సంఘీభావం తెలిపే స్థితికి చేరింది. ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీని నియమిం చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వారకూ రోజుల విమర్శలు చేయడం నానాటికి పరిస్థితులను గందరగోళ స్థితికి తీసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో సీఎస్‌ ఎన్నికల ముందు నిధుల విడుదల గురించి ఆరా తీయడం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెనుక ఎవరో ఉండి, తమ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి స్పష్టంగా ఆరోపిస్తోంది. ఎల్వీ అధికారి కంగా ఢిల్లీ వెళ్లినప్పటికీ, అంతర్గత కారణాలు ఎన్నో ఉన్నాయంటూ టిడిపి చెబుతోంది.
నానాటికి పెరుగుతోన్న అంతరం..
ప్రజలకు, పాలక వర్గానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ప్రజలకు మేలు జరుగు తుందనే భావన అందరిలో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు కొత్త వివాదాలకు కారణంగా మారాయి. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠాను మార్చి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎన్నికల సంఘం అత్యంత వేగంగా నియమించిన విషయం విదితమే. ఈ అంశంపై సిఎం చంద్రబాబు తమను ఏవిధం గానూ సంప్రదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నిం చారు. అంతటితో ఆగకుండా, కోవర్టు-జగన్‌ కేసుల్లో సహముద్దాయి అంటూ ఎల్వీపై తీవ్ర సంచలనాత్మక ఆరోపణలు చేశారు. సీఎస్‌గా గత నాలుగురోజుల నుంచి సమీక్షలు నిర్వహిస్తున్న వైనంపై టిడిపి నేతలు తమ అసహనాన్ని బహి రంగంగానే వ్యక్తీకరిస్తున్నారు.