కవలలకు జన్మనిచ్చిన బామ్మ

74-year-old woman and husband
74-year-old woman and husband

అమరావతి: మంగాయమ్మ(74) అనే వృద్ధురాలు పండంటి కవలలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో ఈరోజు డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్.. మంగాయమ్మకు విజయవంతంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1992లో పెళ్లయ్యింది. ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా వీరికి సంతానం కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక బలంగా ఉండేది.

ఈ క్రమంలో మంగాయమ్మ 2018 నవంబర్‌లో గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించింది. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పివి మనోహర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉదయ్ శంకర్ ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేస్తూ వచ్చారు. ఈ రోజు ఉదయం 10.30కు మంగాయమ్మకు సిజేరియన్ చేశారు. ఇద్దరు కవలలైన ఆడ పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ఈ వయసులో గర్భం దాల్చడం ఓ ప్రపంచ రికార్డ్ అయితేఉ కవలలకు జన్మనివ్వడం మరో రికార్డ్ అని డాక్టర్లు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/