హోదా ఇవ్వకుండా దగా

DEVINENI
DEVINENI

హోదా ఇవ్వకుండా దగా

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా, విభజనహామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లపాటు కాలయా పన చేసి ఇప్పటికి ఇవ్వకుండా దేశప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దగా చేసిందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ (టెన్యూర్‌) వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం ఒక రోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వారి రిలేదీక్షను నిమ్మరసమిచ్చి విరమింపజేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 14వ ఆర్ధిక సంఘం సూచనల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని ప్రత్యేక ప్యాకేజ్‌కు అంగీకరించారని, ఆఖరికి ప్రత్యేక ప్యాకేజ్‌, హోదా రెండూ ఇవ్వకుండా కేంద్రం దగా చేసిందన్నారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా నిధులను అందించడంతో ముఖ్యమంత్రి కేంద్ర వైఖరితో విసుగెత్తి బయటికొచ్చి రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పోరాటం ప్రారంభించారన్నారు. దీనికి మద్దతుగా పిపిలు దీక్షలు చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమాన్ని సెట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించగా, శాసనసభ విప్‌ బుద్దా వెంకన్న కార్యక్రమంలో పాల్గొని సంఘీ భావం తెలిపారు. రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ఏపిపి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గరిమెళ్ల దైవప్రసాద్‌, ఏఐసిసి సభ్యుడు వి గుర్నాథం, గడ్డం రాజేశ్వరరావు, లంకె వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.