వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భారీ ఏర్పాట్లు

TIRUMALA1
TIRUMALA1

తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 18న అని ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి జేఈవో శ్రీనివాస్‌రాజు తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా దాదాపు 44 గంటల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 17 నుంచి 20వ తేది వరకు అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  వైకుంఠ దర్శనం కోసం 17వ తేది ఉదయం 10 గంటల నుంచి భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని చెప్పారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టు‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోతే.. భక్తులను ఆలయ మాడ విధుల్లోని గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. చలి అధికంగా ఉంటే క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగు నీరు, ఆహారం పంపిణీ చేస్తామని తెలిపారు. డిసెంబర్‌ 18న వేకువజామున వైకుంఠ ద్వారాలు తెరుస్తామని ఆయన  వివరించారు.