వైఎస్‌ జగన్‌కు భద్రత పెంచండి

Roja
Roja

ఏపి సిఎం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు
వైఎస్సార్సీ ఎంఎల్‌ఏ ఆర్‌.కె.రోజా
హైదరాబాద్‌: వైఎస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రతను పెంచాలని ఆ పార్టీ ఎంఎల్‌ఏ ఆర్‌.కె.రోజా డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌కు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోవడం లేదని, భద్రతను పెంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సోమిరెడ్డికి సోది తప్ప ఏమీ తెలియదని, ఐదు సార్లు ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఎంఎల్‌సి ఇచ్చి, మంత్రి పదవిని ఇచ్చారంటూ సోమిరెడ్డి పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిజిపి ఠాకూర్‌పై తమకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబు నాయుడికి మానవత్వం లేదని, కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో సిబిఐతో గానీ, జ్యుడిషియరీ విచారణ చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తే వారిని తప్పుపడతారా?వారంతా కుమ్మక్కు అయినట్లా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు మానుకుని పరిపాలన సక్రమంగా చేయాలన్నారు. వైఎస్‌ జగన్‌ను మరింత భద్రత పెంచి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నర్‌ డిజిపితో మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. గతంలో క్యాండిల్‌ ర్యాలీకి వచ్చిన వైఎస్‌ జగన్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అన్నారు. మాజీ గవర్నర్‌ రోశయ్య చాలా సార్లు అన్నారని చంద్రబాబు నాయుడు కుడిచేయికి దెబ్బతగిలితే, ఎడమ చేతికి కట్టుకడతారన్న విషయాన్ని గుర్తుచేశారు. అల్లర్లు సృష్టించే తత్వం చంద్రబాబు నాయుడికే ఉందని, వైఎస్‌ జగన్‌కు కాదన్నారు. కాగా జగన్‌ విశాఖ పట్టణం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత ఇంటికి వెళ్లి, తిరిగి ఆసుపత్రి వచ్చారంటూ వ్యాక్యలు చేయడం దారుణం అన్నారు. ఎవరో ప్రోత్సబలంతో ఆసుపత్రికి వచ్చారని పేర్కొనడం దారుణమని, ఈవిషయంలో చాలెంజ్‌ విసురుతున్నానన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికే వచ్చారని ఆమె స్పష్టం చేశారు. ఈవిషయంలో ఛాలెంజ్‌ స్వీకరించాలన్నారు.