మోదీ నాట‌కంలో ఇదొక అంకం

Dadi Veerabhadra Rao
Dadi Veerabhadra Rao

విశాఖ: ఎన్నికలు స‌మీపిస్తున్న‌ తరుణంలో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో టీడీపీ పోరాటం చేయడం ఎంతవరకు సబబు అని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. ఈ పోరాటం రెండేళ్లు ముందే చేసిఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీకి, చంద్రబాబుకి ఒకరిపై ఒకరికి విశ్వాసంలేదని అన్నారు. ఆఖరి క్షణంలో యుద్ధం చేయడంవల్ల ప్రయోజనం లేదని అన్నారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు  ఈ పోరాటం రెండేళ్ల కిందట చేసి ఉంటే మోదీ దిగివచ్చేవారని అన్నారు. టీడీపీ, ఎన్డీయేది అనుమానాల కాపురంగా అర్థమవుతుందని దాడి పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీకి హోదా ఇస్తే ఆ క్రెడిట్ మోదీకే దక్కుతుందని, ఆ ఆశ కూడా కనిపించడంలేదని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణలే చేస్తున్నప్పుడు రైల్వే జోన్ ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని వీరభద్రరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం కట్టుకథలు చెబుతోందని, గతంలో వాజ్‌పేయ్ ఒకేసారి నాలుగైదు రైల్వే జోన్‌లను ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా దాడి గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం జాతీయ స్థాయి విద్యా, ఆరోగ్య సంస్థల కోసం రూ. 12వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా… కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చారని దాడి వీరభద్రరావు విమర్శించారు. ఈ విధంగా కేంద్రం ఉంటే బాధగా ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు విశేషంగా నిధులు ఇస్తూ… ఏపీ విషయం వచ్చేసరికి… కేంద్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, డిఫెన్స్‌కు నిధులు తగ్గుతాయని అరుణ్ జైట్లీ అనడం దారుణమని.. అరుణ్‌జైట్లీ బీజేపీ ప్రభుత్వానికి శకుని అని వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు ఎన్డీయేకి తలాక్ ఇచ్చిన తర్వాత థర్డ్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తారన్న భయం బీజేపీకి ఉందన్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ముందుపెట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఉండవచ్చునని వీరభద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు బీజేపీయే కారణమని, చంద్రబాబుపై కోపంతోనే ఇదంతా చేయిస్తుందని, మోదీ నాట‌కంలో ఇదొక అంక‌మ‌ని దాడి వీరభద్రరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.