పక్కదారిన కరవు నిధులు

Funds
Funds

ఇతర పథకాలకు మళ్లింపు
రైతులను ఆదుకోని తెలుగు ప్రభుత్వాలు
హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరువు నిధులు పక్కదారి పడుతున్నాయి. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకుగాను కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేస్తున్న నిధులను రైతులకు ఖర్చు చేయాల్సి ఉన్నా, దాన్ని విస్మరిస్తు, తెలుగు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు మంజూరు చేసిన నిధులను కరువు జిల్లాల్లో ఖర్చు పెట్టకుండా ఇతర పథకాలకు మళ్లిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మండలాలకు కేంద్రప్రభుత్వం ప్రతీ ఏటా నిధులను విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని తక్కువ వర్షపాతం నమోదు అయ్యే పూర్వపు మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 281 శాశ్వత కరువు మండలాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో కరువు సహాయక చర్యలను తీసుకునేందుకు వీలుగా 2015-16, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో సాధారణ కరువు నిధుల కింద 778 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. దీంతోపాటు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రత్యేక కరువు గ్రాంట్‌గా మరో 790 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద 86 కోట్ల రూపాయలను కలిపి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈవిధంగా మొత్తం 1,664 కోట్ల రూపాలయను కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకుగాను ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించి వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇందులో కేవలం 400 రూపాయల మేర మాత్రమే కరువు నిమిత్తం ప్రత్యామ్నాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరువు నిధుల ఖర్చు జరుగుతున్న తీరు ఇదే విధంగా ఉందని సంబంధిత అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప తదితర జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడడం సర్వసాధారణమైంది. తీవ్ర దుర్భిక్షం ఏర్పడిన మండలాల్లో రైతుల దుస్థితి, ఎండిపోతున్న పండ్ల తోటలు, తాగునీరు లేకపోవడం, పశుగ్రాసానికి ఇబ్బందులు పడుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 230 కరువు మండలాలను గుర్తించగా కేంద్రం 237.51 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 2015-16 సంవత్సరంలో 359 కరువు మండలాలకు గాను 433.37 కోట్ల రూపాయలు, 2016-17 సంవత్సరంలో 301 కరువు మండలాలకు 518.93 కోట్ల రూపాయలు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 121 కరువు మండలాలకు గాను 113.14 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కరువు నిధులను విడుదల చేసింది. ఈ విధంగా మొత్తం 1,303.15 కోట్ల రూపాయలను కరువు నిధులను రాష్ట్రానికి మంజూరు చేసింది. అయితే ఈ నిధుల్లో దాదాపు 450 కోట్ల రూపాయలను మాత్రమే కరువు నెలకొన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలకూ కేంద్రం విడుదల చేసిన నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను కూడా కలిపి కరువు జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని వారిని ఆదుకోవాల్సి ఉన్నా మొక్కుబడిగా నిధులను ఖర్చు చేసి మిగిలిన సొమ్మును ఇతర పథకాలకు మళ్లించినట్లు ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. కరువు బారిన పడిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ప్రత్యామ్నాయ పంటల సాగు, తాగు నీటి సరఫరా, పశువులకు మేత, వలసలను అరికట్టడం వంటి పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరువు నిధులను దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోకుండా వాటిని పక్కదారి పట్టించినట్లు విమర్శలు ఉన్నాయి.