తొలి దరఖాస్తు చేసుకున్న పవన్‌ కల్యాణ్‌

Pavan kalyan
Pavan kalyan

అమరావతి: జనసే పార్టీ అధినేత పవన్‌ అధ్యక్షతన రాబోయే శాసనసభ, లోక్‌సభ స్థానాల నుండి అభ్యర్థులు పోటికి దింపే విషయంపై, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి( పీఏసీ) మంగళవారం చర్చించింది.విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించింది. వడపోత కమిటీకి మార్గదర్శకాలిచ్చింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎలా వడబోయాలో సమావేశంలో చర్చించి ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యం లేకుండా నిబద్ధత, కష్టపడి పని చేసే తత్వం ఆధారంగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ఈ విషయంలో పార్టీ అధినేతగా తనకు కూడా మినహాయింపు లేదంటూ పవన్‌కల్యాణ్‌ తన బయోడేటాను వడపోత కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్‌, మాదాసు గంగాధరం, రావెల కిషోర్‌బాబు, తోట చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపే అభ్యర్థులు వారి బయోడేటాలను మాదాసు గంగాధరం ఆధ్వర్యంలోని వడపోత కమిటీకి సమర్పించాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు. అభ్యర్థులు కూడా పక్క మార్గాలకు వెళ్లకుండా తాము నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి తప్ప వేరెవరికీ దరఖాస్తులు సమర్పించవద్దన్నారు. వడపోత కమిటీ నాయకుడు మాదాసు గంగాధరం మాట్లాడుతూ పార్టీ నాయకుడు తమపై పెట్టిన బాధ్యతను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని చెప్పారు.