డిజిపి సాంబశివరావుకు పొడిగింపు లేనట్లే!

 

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

డిజిపి సాంబశివరావుకు పొడిగింపు లేనట్లే!

రేసులో ఎసిబి చీఫ్‌ ఆర్‌.పి ఠాకూర్‌, విజయవాడ కొత్వాల్‌ గౌతం సవాంగ్‌

హైదరాబాద్‌: ఎపి డిజిపి నండూరి సాంబశివరావుకు పొడిగింపు లేనట్లుగానే తెలుస్తోంది. ఏడాదిన్నరగా ఇంఛార్జి డిజిపిగా కొనసాగుతున్న సాంబశివరావును మరో రెండేళ్లు అలా కుదరకపోతే కనీసం ఆరు నెలల పాటు వుండేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు యూపిఎస్‌సి మరోమా రు అడ్డుతగిలింది.

దీంతోవచ్చే డిసెంబర్‌ నెలా ఖరున ఎపి సర్కారు నూతన డిజిపిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఎపి నూతన డిజిపి రేసులో 1986 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారులుగా వున్న ఎసిబి చీఫ్‌ ఆర్‌.పి ఠాకూర్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌గా వున్న గౌతం సావంగ్‌లు ముందు వరుసలో వు న్నారు. వీరితో పాటు ఇదే బ్యాచ్‌కు చెందిన ఆ రాష్ట్ర ఫైర్‌ సర్వీస్‌ డిజి విన§్‌ు రంజన్‌ రే, కేంద్ర సర్వీసులో వున్న విఎస్‌కె కౌముదిల పేర్లు కూడా డిజిపి రేసులో వు న్నట్లు వార్తలు వస్తున్నా ఠాకూర్‌, గౌతం సావంగ్‌లలో ఎవరో ఒకరిని ఆ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు సాంబశివరావును డిజిపి పదవిలో మ రికొంత కాలం పాటు వుండేలా ఆ రాష్ట్రం సర్వ శక్తులు ఒడ్డుతుండడంపై యుపిఎస్‌సి నుంచి విమర్శలు వచ్చాయని సమాచారం. ఎపి ఇంఛార్జి డిజిపిగా వున్న సాంబ శివరావు వచ్చే డిసెంబర్‌ నెలాఖరున పదవీ విరమణ చేస్తుండడంతో కొత్త డిజిపి ఎంపిక కోసం ఎపి సర్కారు ఏడుగురు అధికారులతో కూడిన జాబితాను పంపగా ఆ జాబితాను యూపీఎస్సీ వెనక్కు పంపడం తెలిసిందే. ముఖ్యంగా ఆరు నెలల నుంచి ఏడాది లోపు పదవీ విరమణ చేయబోయే వారిపేర్లను పంపడంపై యుపిఎస్‌సి రాష్ట్ర సర్కారుపై మండి పడడం విదితమే.

వీరి పేర్లను తొలగించి కొత్తగా మరో జాబితాను పంపాలని యుపిఎస్‌సి సూచించడం సంచలనం రేపింది. అయితే యుపి ఎస్‌సి చేసిన సూచనలను రాష్ట్ర సర్కారు ఎంత మాత్రం పట్టించుకోకుండా అదే జాబితాను మళ్లీ పంపింది. దీనిపై ఢిల్లీలో బుధవారం జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పటికే 16 నెలలుగా ఏపీ ఇన్‌చార్జి డీజీపీగానే సాంబశివరావు కొనసాగుతున్నారు.

ఆయన డిసెంబర్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీని కొనసాగించేందుకు ఆసక్తి చూపుతుండగా ఇందుకు యుపిఎస్‌సి ససేమిరా అంటోంది. అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరో ఆరు నెలల పాటు సాంబశివరావు పదవీకాలాన్ని పొడిగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో కేంద్రం వైఖరి ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పటి వరకు కేంద్రం ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి పొడిగింపు ఇవ్వలేదు.

చీఫ్‌ సెక్రటరీల విషయంలో కొన్నిసార్లు ఇలాంటి పొడిగింపులు ఇచ్చినా డిజిపిల విషయంలో పదవీ బాధ్యతలు చేబట్టిన సమయాన్ని పరిగణలోకి తీసుకుని కొందరికి పొడిగింపు ఇచ్చింది. ఇలా పొడిగింపు పొందిన వారిలో తెలంగాణ పూర్వపు డిజిపి అనురాగ్‌ శర్మ, ఎపి పూర్వపు డిజిపి జె.వి రాముడు, తమిళనాడు మాజీ డిజిపి లతికా చరణ్‌ సహా మరో ఇద్దరు వున్నారు. అయితే సాంబశివరావు ఇప్పటి వరకు పూర్తి స్థాయి డిజిపిగా నియమితులు కాకపోవడంతో ఆయనకు పొడిగింపు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా యుపిఎస్‌సి సూచనలను పరిగణలోకి తీసుకునే వీలుంది.

ఒకవేళ ఈ విషయంలో యుపిఎస్‌సి కాదం టే కేంద్రం కూడా చేసేది ఏమీ వుండుదు. అప్పుడు రాష్ట్ర సర్కారు కచ్చితంగా నిబంధనల ప్రకారం కొత్త డిజిపిని నియమించాల్సి వుంటుంది. ఈ లెక్కన ఎసిబి చీఫ్‌ ఠాకూర్‌తో పాటు విజయవాడ కొత్వాల్‌ గౌతం సావంగ్‌లు ముందు వరుసలో వున్నారు. వీరికన్నా సీనియర్లుగా వున్న 1982 బ్యాచ్‌ అధికారి ఎస్‌వి రమణమూర్తికి ఏడా ది పాటు సర్వీసు వుండగా 1985 బ్యాచ్‌ అధికారి మాలకొండయ్యకు ఎనిమిది నెలల సర్వీసు వుంది.

1985 బ్యాచ్‌ అధికారి కేంద్ర సర్వీసులో వున్న డాక్టర్‌ రజ్వంత్‌ పాల్‌ సింగ్‌కు కూడా ఏడాది సర్వీసు వుంది. అయితే యుపిఎస్‌సి నిబంధనల ప్రకారం కచ్చితంగా రెండేళ్ల సర్వీసు వున్న వారు మాత్రమే డిజిపి పదవి ఎంపికలో అర్హులు కావడంతో ఈ ముగ్గురు అధికారులు రేసులో లేరని చెప్పాలి. కాగా ఎపి డిజిపి రేసులో వున్న ఠాకూర్‌కు మూడున్నరేళ్ల సర్వీసు వుండగా గౌతం సావంగ్‌కు ఐడున్నరేళ్ల సర్వీసు వుంది. ఈ ఇద్దరు అధికారులు వివాదరహితులుగా వున్నారు.

ఇదే సమయంలో సిఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. పదవీ విరమణ తేదీ రీత్యా మొదటగా డిజిపి అవకాశం ఠాకూర్‌కు ఇచ్చి ఆయన తరువాత గౌతం సావంగ్‌కు డిజిపి పదవి ఇవ్వాలని రాష్ట్రం నిర్ణయించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఉత్తరాది అధికారి అయిన ఠాకూర్‌ తరపున కేంద్రంలో అప్పుడే లాబీయింగ్‌ జరుగున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన గౌతం సావంగ్‌కు డిజిపి పదవి దక్కితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఒక రాష్ట్రానికి డిజిపి అయిన తొలి అధికారిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు. ఏది ఏమైనా ఎపి డిజిపి నియామకం విషయంలో మరో నెలరోజుల పాటు సస్పెన్స్‌ కొనసాగే వీలుంది