డాలర్ల పేరుతో మోసం

Dollars, Rs
Dollars, Rs

డాలర్ల పేరుతో మోసం

నెల్లూరుక్రైం,: ఢిల్లీ ఓల్డ్‌ సిటీకి చెందిన ముఠా నెల్లూరుజిల్లాలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ ఇండియా డబ్బులు ఇస్తే అమెరికన్‌ డాలర్లు ఇస్తామని ఆశ చూపి నగదు వసూళ్లు చేసే ముఠా గుట్టును సిసిఎస్‌ పోలీసులు రట్టు చేశారు. ఇండియా కరెన్సీని వసూళ్లుచేసుకొని న్యూస్‌ పేపర్స్‌ని గుడ్డలో మూట కట్టి, పోలీసులు వస్తున్నారని..ఇంటికి వెళ్లి చూసుకోండి అంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డిఎస్పీ ఎం బాలసుందరరావు తెలిపారు. గురువారం స్థానిక సిసిఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈస్ట్‌ ఢిల్లీ ఎక్సటెన్షన్‌ లక్ష్మినగర్‌కు చెందిన మహ్మద్‌ జబ్బార్‌, సిరాజుల్‌, రిదామ్‌ ఖాన్‌లు గత కొంతకాలంగా నెల్లూరు చుట్ట ప్రక్కల ప్రాంతాలలో సంచరిస్తూ అమెరికన్‌ డాలర్‌ నోట్లను అమాయకులైన హిందీ తెలిసిన వారికి చూపిస్తూ ఇండియా డబ్బులు ఇస్తే వాటికి రెండింతలుగా అమెరికన్‌ డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తారని, చివరికి బాధితుల వద్ద ఇండియన్‌ కరెన్సీ తీసుకొని వారికి సబ్బుకు చుట్టిన న్యూస్‌ పేపర్స్‌ని గుడ్డలో మూటకట్టి పోలీసులు వస్తారని ఇక్కడి నుండి త్వరగా ఇంటికి వెళ్లి చూసుకోవాలని పంపివేస్తారని చెప్పారు. బుధవారం స్థానిక రంగనాయకులపేటకు చెందిన షేక్‌ హైదర్‌ ఆలీ అనే అతని వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి నమ్మించి ముందుగా అమెరికన్‌ డాలర్స్‌ చూపించి అతనిని కోవూరుకు పిలిచి అతని వద్ద రూ.50వేల నగదును తీసుకోవడం జరిగిందన్నారు. ముందుగానే తయారుచేసుకొని ఉన్న గుడ్డల సబ్బుకు న్యూస్‌ పేపర్‌ చుట్టి దానిని గుడ్డలో కట్టిన మూటను ఇచ్చి మోసం చేయడం జరిగిందన్నారు. దొంగల చేతిలో మోసం పోయానని తెలుసుకున్న బాధితుడు కోవూరు పోలీసులకు ఫిర్యాదుచేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సిసిఎస్‌, కోవూరు పోలీసులు గురువారం సాయంత్రం కోవూరులోని సాలుచింతల సెంటర్‌ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి రూ.50వేల నగదు, అమెరికన్‌ 20 డాలర్‌నోట్లను స్వాధీనం పరుచుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్న ముగ్గుర్ని అరెస్ట్‌చేసి నగదును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం సిఐ ఎస్‌కె బాజిజాన్‌సైదా, ఎస్‌ఐలు ఎస్‌కె షరీఫ్‌, ఎ వెంకటరావు, సిబ్బంది విశ్వనాథం, అద్దంకి వెంకటేశ్వర్లు, విజయప్రసాద్‌, నరేష్‌, సుబ్బారావు, అరుణ్‌కుమార్‌లను డిఎస్పీ బాలసుందరరావు ప్రత్యేకంగా అభినందించారు. వీరికి త్వరలో ఎస్పీ చేతుల మీదుగా రివార్డులను ఇప్పించనున్నట్లు డిఎస్పీ తెలిపారు.
=