ఎల్కేజీ విద్యార్థుల‌పై ఉపాధ్యాయురాలి అతి దండ‌న‌

Teacher Punishment
Teacher Punishment

కృష్ణా : కృష్ణా జిల్లా తిరువూరులోని నాగార్జున మెరిట్‌ స్కూల్‌ యుకెజి చదివే హఫీజ్‌ అనే బాలుడిని ఉపాధ్యాయురాలు లలిత చితకబాదింది. ఇదే పాఠశాలలో 6వ తరగతి చదివే గూడూరు వెంకట నర్సింహారెడ్డి అనే విద్యార్థిని కూడా సోషల్‌ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు రమేష్‌ కర్రతో కొట్టడంతో వారి తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఇరువురు విద్యార్థులది తిరువూరు మండలం మునకుళ్ల కావటం విశేషం. విషయం సోమవారం జరిగినప్పటికీ హాఫిజ్‌ అనే బాలుడిని స్నానం చేయించేందుకు చూడగా వంటిమీద ఎర్రగా కమిలిపోయిన వాటాలు కనబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు పొక్కకుండా ఇరువురి మధ్య సామరస్య వాతావరణం కలిగించేందుకు పెద్ద మనుషులు రంగ ప్రవేశం చేసినట్లు తెలిసింది. ముక్కు పచ్చలారని పసివాడిని గొడ్డును బాదినట్టుగా బాదటానికి మనసు ఎలా వచ్చిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యాహక్కు చట్ట ప్రకారం యుకెజి, ఎల్‌కెజి లేనప్పటికీ వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసే ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వెనుక అంతర్యం ఏమిటని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.