అవనిగడ్డ: చైనా నుంచి వైద్య విద్యార్థిని రాక ..

China Students (File)

విజయవాడ: చైనాతో పాటు పలు ఆసియా దేశాలను కరోనా వైరస్‌ హడలెత్తిస్తుండడంతో ఆయా దేశాల నుంచి ఎవరు వచ్చినా ఆ ప్రాంతంలో కరోనా కలకలం చెలరేగుతోంది. ఇదే పరిస్థితి కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది. అవనిగడ్డకు చెందిన ఓ విద్యార్థిని చైనాలో ఎంబీబీఎస్ చదువుతోంది. అక్కడ కరోనా వైరస్ కలకలం చెలరేగగానే ఈ నెల 12న చైనా నుంచి సొంతూరు వచ్చేసింది. కాగా, కరోనా వైరస్ భారత్ లోకి వ్యాపించిందన్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య యంత్రాంగం జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది.

చైనా నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో అధికారుల సూచన మేరకు చైనా నుంచి వచ్చిన బాలిక అవనిగడ్డ వైద్య సిబ్బందికి తన వివరాలు తెలియజేసింది. వారు రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వడంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని వారు ఆదేశించారు. ఆ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎటువంటి వైరస్ సోకలేదని తేల్చారు. కానీ ఈ వైద్యపరీక్ష లు స్థానికంగా కలకలాన్ని రేపింది. దీంతో ఎటువంటి పుకార్లు నమ్మవద్దని వైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/