ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది

ఏపీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కొన్నేళ్లుగా వరుసగా సత్తా చాటుతున్న ఏపీ మరోసారి బిజినెస్ ర్యాంకుల్లో సత్తా చాటుకుంది. బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఇవాళ టాప్‌ అచివర్స్‌లో ఉన్న 7 రాష్ట్రాల వివరాలను ఢిల్లీలో ప్రకటించారు. ఇందులో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణకు నాలుగో స్ధానం దక్కింది.

టాప్ అచివర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తం నాలుగు కేటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి కొత్త విధానాలతో కేంద్రం ఈ ర్యాంకింగ్ ప్రక్రియను చేపట్టింది. 10,200 మంది పెట్టుబడిదారులు, వాటాదారుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరించబడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 97.89శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. కాగా గుజరాత్‌ 97.77 శాతం, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతంతో నాల్గో స్థానంలో నిలిచాయి.

ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో టాప్ లో ఉన్న ఏపీ ఇప్పుడు వ్యాపార సంస్కరణల ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ టాప్ లో నిలవడం విశేషం. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు తాజా ఫీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.