ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫై అసలు క్లారిటీ ఇచ్చిన ఎస్పీ ఫకీరప్ప

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫోన్ కాల్ ఫై ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని తెలిపారు. ఆ వీడియో మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్‌ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రివేళ 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడా ఫోన్‌ నెంబర్‌తో మొదటగా.. ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ వీడియో షేర్ చేసినట్టు గుర్తించాం. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోన్ నెంబర్ ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వొడాఫోన్‌ నుంచి నిందితుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం అని ఎస్పీ తెలిపారు.

ఇక ఈ ప్రకటన తర్వాత గోరంట్ల మాధవ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్ర. కొంత మంది దుర్మార్గులు చేసి పని ఇది. ఇది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని ఆరోజే చెప్పాను. నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసు. ఫేక్‌ వీడియో సృష్టించి నన్ను అవమానించాలని చూశారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తాను అన్నారు.