ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై మాజీ సైనికాధికారుల ప్రశ్నలు

ఇప్పటి వరకు ఎంతమందికి అవకాశం కల్పించారో కాస్త చెప్పాలని ప్రశ్న

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల అగ్నివీరులకు తాను ఉద్యోగాలిస్తానంటూ చేసిన ట్వీట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని స్వాగతించిన ఆనంద్ మహీంద్రా నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు సహా పలువురు మాజీ సైనికాధికారులు కూడా తీవ్రంగా స్పందించారు. వీరిలో భారత నావికాదళం మాజీ చీఫ్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మాజీ చైర్మన్ అరుణ్ ప్రకాష్ వంటి వారు కూడా ఉన్నారు.

సర్వీసు పూర్తిచేసుకున్న అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తారు సరే.. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఎంతమంది సైనికాధికారులకు మీ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కొత్త పథకం కోసం వేచి చూడడం ఎందుకని, ఇప్పటికే నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వేలాదిమంది మాజీ సైనికులు, సైనికాధికారులు ఉన్నారని, ప్రతి సంవత్సరం వేలాదిమంది సైన్యం నుంచి బయటకు వచ్చి తమ రెండవ కెరియర్‌ను ప్రారంభించేందుకు వేచి చూస్తున్నారని ఆనంద్ మహీంద్రాకు అరుణ్ ప్రకాశ్ గుర్తు చేశారు. అలాంటి వారిలో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారో వెల్లడిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

తాను నలభై సంవత్సరాలు భారత వాయుసేనలో సేవలు అందించానని, ఇలాంటి హామీలు ఏళ్ల తరబడి వింటున్నానని, భారత వాయుసేన మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ అన్నారు. మరోవైపు, ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా కూడా స్పందించారు. అగ్నివీరులకు తాము కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/