ఆదర్శమైన క్రీడా విధానం అవసరం

దేశవ్యాప్తంగా ప్రోత్సహించాలి

An ideal sports approach is required
An ideal sports approach is required

మనిషిని శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంచి మానసికంగా వికసింప చేసేవి క్రీడలు. క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది.

శత్రు దేశాల్లో సైతం మన జాతీయజెండాను సగర్వంగా ఎగురవేయగలిగేది క్రీడాకారులు మాత్రమే.

ఆధునికత పేరుతో గ్రామీణ మారుమూల ప్రాంతాల సాంస్కృతిక కళా రంగాలపై ఎంతగా దాడి జరిగిందో పాశ్చాత్యీ కరణ, కార్పొరేటీకరణ ప్రభావం ప్రజల జీవన శైలిపై ఎంత ప్రభావం చూపిందో మనం గమనిస్తున్నాం.

మన పిల్లల్ని మనం మార్కుల కొలబద్దలుగా భావిస్తున్నామే తప్ప వారిని భావి పౌరులుగా, మానవ వనరులుగా చూడటం లేదు.

ర్యాంకుల సాధనలో స్కూలు, ట్యూషన్‌ హోంవర్కులు తప్ప వారి మాన సిక వికాసానికి శారీరక వ్యాయామానికి కావలసిన ఆటలను దూరం చేస్తున్నాం.

నేటితరం పిల్లలకు ఆటలు అంటే కేవలం కంప్యూటర్‌గేమ్స్‌, వీడియోగేమ్స్‌ సెల్‌ఫోన్‌ గేమ్స్‌ తప్ప మరేవీ అందుబాటులో ఉండటం లేదు. ఎప్పుడైనా సమయం దొరికితే అపార్ట్‌మెంట్‌లో గల్లీలలో ఆడుకునే క్రికేట్‌ తప్ప మరే ఇతర ఆటలంటే తెలియని స్థితి.

నగరాల్లో పట్టణాల్లో యావత్‌ దేశంలో క్రికెట్‌కు తప్ప ఇతర క్రీడలకు ఆదరణ లేకుండా పోతుంది. మన గ్రామీణ సాంప్రదాయ క్రీడలు శారీరక శ్రమతో పాటు మానసికోల్లాసం ఇచ్చే క్రీడలన్నీ కనుమరుగైపోతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలలోనూ జరిగిన అన్యాయమే తెలంగాణ క్రీడారంగానికి, క్రీడాకారులకు జరిగింది. తెలంగాణ సంప్రదాయ క్రీడలు మాయమైపోయాయి.

తెలంగాణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభకు సరైన ప్రోత్సాహకాలు దక్కలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలోనే ఈ అన్యా యాన్ని సవరించే దిశగా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. క్రీడలకు అధిక ప్రోత్సాహం ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది.

విదేశాలకు వెళ్లే క్రీడాకారులకు మూడు లక్షల రూపాయలు ఖర్చుల కింద ఇవ్వడం, క్రీడాకారులకు ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశానికి రెండు శాతం కోటా దక్కేలా ఆదేశాలు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల నుండి విశేషమైన కృషి చేస్తోంది.

ఇప్పుడు సమగ్ర క్రీడా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకర పరిణామం.

తెలంగాణ రాష్ట్ర నూతన క్రీడా విధానం స్పష్టమైన విధి విధానాలతో ముందస్తు ప్రణాళికతో దీర్ఘకాలిక వ్యూహాలు స్వల్పకాలిక లక్ష్యాలతో కూడిన విధానం కావాలి.

గ్రామీణ క్రీడలకు క్రీడాకారులకు ప్రాధాన్యం దక్కేలా రాష్ట్రంలో కేజీ టు పీజీ ప్రతి విద్యాసంస్థ క్రీడాభి వృద్ధిలో భాగం తీసుకునేలా వాటిలో నిరంతరం క్రీడా కార్య క్రమాలు కొనసాగేలా స్పష్టమైన క్రీడా క్యాలెండర్‌ ప్రకటించాలి.

పతకాలు సాధించిన తర్వాత ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా పతకాలు సాధించేలా ప్రోత్సాహం ఉండాలి. విద్యాలయాల్లో క్రీడలు తప్పనిసరి చేయాలి. పాఠ్యాంశాల్లో క్రీడలు తప్పకుండా చేర్చాలి. ప్రైవేట్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో క్రీడా సౌకర్యాలు తప్పకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలి.

క్రీడా సంఘాలలో నిజమైన క్రీడాకారులకు మాత్రమే ప్రాధాన్యత దక్కేలా, రాజకీయ నాయకుల జోక్యం లేని క్రీడా సంఘాలు ఉండే విధంగా నిబంధనలు తీసుకురావాలి.

క్రీడారంగం అభివృద్ధి అంటే భారీ క్రీడా మైదానాలు నిర్మించడం, పతకాలు సాధించిన వారికి భారీగా బహుమతులు ప్రకటించడం మాత్రమే కాకుండా ప్రైజ్‌ మనీ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు కాకుండా దేశం కోసం ఆడి పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రాధాన్యత దక్కాలి.

మన రాష్ట్రంలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో హకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఉన్నాయి.

మిగతా అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద లభ్యత ఉన్న నిధుల నుంచి దళిత గిరిజన క్రీడాకారులకు క్రీడా కార్యక్రమాలు రూపొందించాలి.

గిరిజనులకు సహజంగా అలవడే ఆర్చరీ, అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌ తదితర క్రీడాంశాల్లో అదేవిధంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క జిల్లాలో కొన్ని క్రీడాంశాలకు ప్రాధా న్యత ప్రవేశం అధికంగా ఉంటుంది. వాటిని గుర్తించి ప్రోత్స హించాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నది. నిరుపేద క్రీడాకారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ వంటి పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలి.

కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందిన పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యత కింద ఖచ్చితంగా క్రీడా కార్యక్రమా లు చేపట్టే విధంగా, ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి.

  • సురేష్‌ కాలేరు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/