అంతుచిక్కని వ్యాధి!

నీటి కాలుష్యం కారణమై ఉండవచ్చుననే అనుమానాలు

Patients in Eluru Hospitals
Patients in Eluru Hospitals

ఆరోగ్యమే జాతి మహాభాగ్యం. దేశ ప్రజలను పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేందుకు గత ఏడు దశాబ్దాలుగా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చుచేశారు, చేస్తూనే ఉన్నారు. అటు కేంద్రప్రభుత్వం కానీ, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు కానీ లెక్కలేనన్ని పథకాలు ప్రవేశపెట్టాయి.

మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆరోగ్యం విషయంలో పాల కులు తీసుకోవాల్సిన చర్యలగూర్చి రాజ్యాంగంలో పొందు పరిచారు. అయినా నేటికీ అందరికీ కనీస ఆరోగ్య వసతులు కల్పించడంలో పాలకులు విఫలమవ్ఞతున్నారనే చెప్పొచ్చు.

ప్రజారోగ్యంపై రోగాల దాడుల పరంపర కొన సాగుతూనే ఉన్నది. కొందరు వ్యక్తులు తమకు తాముగా తెచ్చుకొని సమాజంపై రోగాలను వదులుతుంటే మరికొన్ని ప్రకృతి విసురుతున్నవిగా చెప్పొచ్చు. ఇందులో కొన్ని వ్యాధులను నియంత్రించడం, వైద్యనిపుణులకు కూడా సాధ్యం కావడం లేదు.

ఎంతో ఆధునికతను సముపార్జించు కున్నామని విర్రవీగే మానవజాతిపై ప్రకృతి విసురుతున్న సవాళ్లకు వారూవీరూ అని తేడాలేకుండా అందరూ బలై పోతున్నారు.

ఆ శక్తి ముందు మానవుడు ఎప్పుడూ తల దించుకోవాలనే వాస్తవాన్ని చాటుతూ వ్యాధులు ప్రబలుతు న్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్తకొత్త వ్యాధులు వస్తూనే ఉన్నాయి. కోట్లాది మంది రోగపీడి తులు అవుతున్నారు.

ఆ వ్యాధులను ఎదుర్కొని ప్రజా రోగ్యాన్ని కాపాడటంలో వైద్యులు అందిస్తున్న సేవలు నిరుపమానం. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా పోరులో ఎంతోమంది వైద్య సిబ్బంది, డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడువేల ఐదు వందల మందికిపైగా వైద్యసిబ్బంది కరోనా కాటుకు బలయ్యారని అమెస్ట్రి అంతర్జాతీయ తాజా నివేదిక వెల్లడించింది.

అత్యధికంగా మెక్సి కోలో 1300లకుపైగా అమెరికాలో 1100 వరకు,బ్రెజిల్‌లో 634 మరణించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం రెండో దశలో విజృంభించిన ఆ రక్కసి కొంతమేరకు తగ్గినట్టు అందుతున్నా మళ్లీ ఎక్కడ, ఏ రూపంలో విజృంభిస్తుందనే భయం మాత్రం ప్రజలను వదలడం లేదు.

కరోనాను ఎదుర్కోవ డంలో భారతదేశ ఆరోగ్య వ్యవస్థ ఎంత బల హీనంగా ఉన్నదో బయటపడింది. సిబ్బంది కొరత, వెంటిలేటర్‌ లాంటి పరికరాల కొరత కూడా ఈవ్యాధి వ్యాప్తిని నిరోధించలేకపోయాయి. ఇప్ప టికీ దీనికి ఖచ్చితమైన మందులేదు. నిరోధించే టీకాలు లేవు.

అదిగో, ఇదిగో అంటూ కాలం గడుపుతున్నారే తప్ప స్పష్టమైన సమా చారం ఇవ్వలేకపోతున్నారు. బహుశా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రావొచ్చునని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో గత నాలుగు రోజులుగా అంతుచిక్కని వ్యాధి ఒకటి ప్రజారోగ్యంపై దాడి చేసి గడగడలాడిస్తున్నది.

ఇప్పటికే 450 మందికి పైగా బాధితులు ఆస్పత్రికి రావడం, అందులో కొందరు చికిత్స పొంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఆదివారం ఒకరు చనిపోవడంతో భయబ్రాంతు లవుతున్నారు.

ఏలూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవైఏళ్ల వృద్ధుల వరకు నోట నురగతో మూర్చవచ్చినట్లు నేలపై పడి కొట్టుకుంటూ విలవిల్లాడిపోతున్నారు. అలానే ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతూ నలభైరెండేళ్ల వ్యక్తి అసువులు కోల్పోయాడు

. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా కలవరం రేకెత్తిస్తున్నది. ఆదిలో ఈ వ్యాధి చిన్న పిల్లలకే వ్యాపిస్తుందని భావించారు.కానీ ఆ తర్వాత వయస్సుతో నిమిత్తం లేకుండా వారూవీరూ అని కాకుండా అందరికీ సోకడంతో వైద్యనిపుణులకు అంతు బట్టకుండాపోయింది.

పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉన్న పెద్ద ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు. బాధితుల లక్షణాలు, వారి ఆరోగ్య చరిత్రను అనుసరించి అవసర మైన మందులను అంది స్తున్నారు.

ఇప్పటికీ ఆ వ్యాధి ఎందుకు వస్తుందో? ఎలా వస్తుందో? డాక్టర్లకు అంతు బట్టడం లేదు. పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నారు.వ్యాధి మూలాలు తెలుసుకోగలిగితే అందుకుతగిన చికిత్స అందించేందుకు వీలుంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే కరోనా వ్యాప్తి ఉన్న ఈ తరుణంలో బాధితులందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్‌ వైద్యబృందం అభిప్రాయం మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో చాలావరకు నెగిటివ్‌గానే వచ్చింది. అయితే నీటి కాలుష్యం కారణమై ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవ్ఞతున్నాయి. నీటిని శుద్ధి చేసేందుకు ఉపయో గించే కెమికల్స్‌, మందులు, మోతాదుకు మించి ఉండ వచ్చుననే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

ఆ ప్రాంతంలో గాలి కలుషితమైందేమో ననే అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోమవారం అక్కడికి చేరుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

వైద్య అధికారులతో చర్చించారు. నిన్నటి వరకు ఏలూరుకే పరిమితమైన ఈ వింతవ్యాధి పరిసరప్రాంతాలకు కూడా వ్యాపిస్తుందనే ఆందోళనలు కల్గిస్తున్నాయి. మరొక పక్కదీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

వైద్యనిపుణల బృందాన్ని ఏలూరుకు పంపుతున్నట్లు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారక ముందే ఏలూరులో ఆరోగ్య అత్య యిక పరిస్థితిని ప్రకటించి ప్రత్యేక వైద్యబృందాలను, తాగు నీటి పరీక్ష బృందాలను,పారిశుద్ధ్యబృందాలను తరలించాలి.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి మీనమేషాలు లెక్కపెట్టకుండా ఈ వ్యాధి నియంత్రణకు పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధికి మూలాలను కనుగొంటే తప్పవ్యాధి విస్తరణను నిరోధించలేం, బాధితులను కాపాడలేం.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/